ఒక్కో థియేటర్ కి ఒక్కో చరిత్ర ఉంటుంది.ఇపుడున్న కొంత మంది టాలీవుడ్ డైరెక్టర్లు దాదాపుగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని థియేటర్ లలో చొక్కాలు చించుకుని సినిమా ఇండస్ట్రీకి వచ్చినవాళ్ళే.
మాస్,క్లాస్ ఆడియన్స్ కి కొన్ని ప్రత్యేక థియేటర్లు ఉంటాయి..అలాంటి థియేటర్లను కోరుకునే అభిమానులకి ఇపుడు మరో కొత్త రకం ఫీల్ తెప్పించడానికి రెడీ అవుతున్నారు కొంత మంది ఇండస్ట్రీ పెద్దలు.
ముఖ్యంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో థియేటర్లన్నింటికి ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఇపుడు అలాంటి చరిత్రకి పునాదులుగా నిలిచినా సుదర్శన్ ,దేవి థియేటర్ లు కూడా కొత్త అవతారంలోకి మారబోతున్నాయి. ముఖ్యంగా సుదర్శన్ 35 ఎంఎం స్థానంలో మరో మల్టీప్లెక్స్ ని నిర్మించబోతున్నామంటూ ఏషియన్ సునీల్ నారంగ్ చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం.
ఈరోజు అల్లు అర్జున్ AAA(ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్) పేరుతో అమీర్ పేట్ లో థియేటర్ ఓపెనింగ్ సందర్భంగా మాట్లాడిన సునీల్ నారంగ్.. సుదర్శన్ థియేటర్ వాళ్ళ భాగస్వామ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో మరో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా ఆర్ టీసీ క్రాస్ రోడ్స్ లో థియేటర్లన్ని సింగిల్ స్క్రీన్ లు కలిగి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.