- పీపీపీ మోడల్ లో ప్రాజెక్టు.. నదితో పాటు నగరాభివృద్ధి
- ఫస్ట్ ఫేజ్‌లో హన్ తీరంలో తేలియాడే హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు
- రెండో దశలో హ్యాంగింగ్ పార్కులు, వాణిజ్య సముదాయాలు
- మూసీకి నాలుగు నెలల్లోనే ప్రాథమిక ప్రణాళిక.. దశలవారీగా పనులు
సియోల్ నుంచి వెలుగు ప్రతినిధి: సిటీ మధ్యలో ఉన్న నదిని శుభ్రం చేసుకుని డెవలప్ చేయడంతో దక్షిణ కొరియా రాజధాని సియోల్ ఆర్థికంగా, ఎకలాజికల్గా విరాజిల్లుతున్నది. ఇప్పటికే ఒక దశ డెవలప్ మెంట్ పూర్తయిన.. హన్ నది రెండో దశ డెవలప్మెంట్ ను 2030 కల్లా పూర్తి చేసేలా సియోల్ మెట్రోపాలిటన్ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. ఒకప్పుడు మూసీ నదిలా ఉన్న ఈ హన్ నది.. ఇపుడు మంచి నీటి నదిగా మారడమే కాకుండా.. అభివృద్ధికి ఐకాన్ గా నిలిచింది. హన్ నది సియోల్ సిటీ నుంచి వెళ్తున్నట్లుగానే.. తెలంగాణలోని హైదరాబాద్ లోనూ మూసీ నది పారుతుంది.
అయితే మురికి కూపంగా ఉన్న మూసీని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. దీంతో రాష్ట్రం పెట్టుబడులు, పర్యాటకంతో ఆర్థికంగా బలోపేతం అవ్వడమే కాకుండా హైదరాబాద్ సిటీ వాతావరణాన్ని కాపాడుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. సియోల్ పర్యటనలో రెండో రోజు మంగళవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేంనరేందర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, కాలె యాదయ్య, మున్సిపల్ ముఖ్యకార్యదర్శి దానకిషోర్, ఎంఆర్డీసీఎల్ డైరక్టర్ పి.గౌతమి తదితరుల బృందం హన్ నది డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా చేసిన పనులను పరిశీలించింది.
పీపీపీ పద్ధతిలోసియోల్ లో హన్ నది.. హంగ్ రాజుల కాలంలో 600 ఏండ్ల పాటు విరాజిల్లింది. మూసీ నది కూడా నిజాం రాజుల కాలంలో స్వచ్ఛంగానే ఉండేది. దాని చుట్టూ గొప్ప కట్టడాలు నిర్మించారు. పునరుజ్జీవం విషయంలో హన్ నది.. బాటలోనే మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. హన్ నది అభివృద్ధి కోసం పీపీపీ పద్ధతిలో నిధులు సమకూరుస్తున్నారు. హన్ నది అభివృద్ధి ప్రణాళికకు 549 బిలియన్ వోన్స్ అంచనా వేశారు. రూపాయల్లో ఇది 3,500 కోట్లు. దీనిలో ప్రైవేటు సంస్థల పెట్టుబడి 313.5బిలియన్ వోన్స్ కాగా.. ప్రభుత్వ వాటా 173 బిలియన్ వోన్స్. హైదరాబాద్ లో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను కూడా పీపీపీ పద్ధతిలోనే సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. మరోవైపు హన్ నదికి ఇరువైపులా పెద్ద హైవేను అభివృద్ధి చేశారు. తద్వారా దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వేగంగా అభివృద్ధి జరిగింది.
వరదనీరు, డ్రైనేజీ నీటికి వేర్వేరు వ్యవస్థలు
సియోల్ సిటీలో వరదనీరు, డ్రైనేజీ నీటి నిర్వహణలకు వేర్వేరు వ్యవస్థలున్నాయి. హైదరాబాద్ లోను ఇలాంటి వేర్వేరు వ్యవస్థల ఏర్పాటు కోసం రూ.4వేల కోట్ల అంచనాలతో ఒక ప్రణాళికను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు పంపించామని దాన కిషోర్ తెలిపారు. మరోవైపు గోదావరి నుంచి తరలించే 15టీఎంసీల నీటిలో 10టీఎంసీలను ఘన్పూర్ దగ్గర శుద్ధి చేసి హైదరాబాద్ వెస్ట్ సిటీ తాగునీటి కోసం అందిస్తారు. 2.5 టీఎంసీలను జంట జలాశయాల్లో నీరు తక్కువ ఉన్నప్పుడు నింపేందుకు ఉపయోగిస్తారు. మరో 2.5టీఎం సీలతో మూసీ నదిలో అన్ని కాలాల్లోనూ నీరు ఉండేలా చూస్తారు.
భూవినియోగ ప్రణాళిక అత్యంత కీలకం
మూసీ పునరుజ్జీవంలో భాగంగా రూపొందించే డీపీఆర్ లో భూవినియోగ ప్రణాళిక చాలా కీలకం కానుంది. ఎక్కడ భూమి అందుబాటులో ఉంది. ఆ భూమిని ఎలా ఉపయోగించాలి? ఎక్కడెక్కడ నదీతీరాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలి? తదితర అంశాలన్నీ ఈ భూవినియోగ ప్రణాళికలోనే ఉంటాయి. ఇక హన్ నది అభివృద్ధి ప్రాజెక్టును కూడా దశలవారీగా చేపట్టారు. తొలిదశలో ఫ్లోటింగ్ హోటళ్లు, వాణిజ్య సముదాయాలు ఒకచోట అభివృద్ధి చేశారు. మలిదశల్లో 12 హ్యాంగింగ్ పార్కులు, మరిన్ని తేలియాడే అద్భుత నిర్మాణాలను చేపట్టనున్నారు.
మూసీ నదిని కూడా రెండు దశల్లోనే చేపట్టనున్నారు. అంతేకాదు.. ఇక్కడి పరిశీలన పూర్తయ్యాక మంత్రులు, అధికారుల బృందం చర్చించింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక ప్రణాళికను నాలుగు నెలల్లోనే ఇచ్చేలా.. బాధ్యతలు అప్పగించిన సంస్థను అడగాలని నిర్ణయించింది. ప్రాథమిక ప్రణాళిక అనంతరం.. సమగ్ర ప్రాజెక్టు ప్రణాళికను రూపొందిస్తారు. ఈ డీపీఆర్ ను అనుసరించి దశల వారీగా పనులు చేపడతారు. డీపీఆర్ వచ్చాక తొలి రెండేండ్లలో మూసీ నదిపై అటూ ఇటూ వంతెనలు, అదేవిధంగా నీరు నిల్వ ఉండేలా చెక్ డ్యాంలు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది.
మూసీ పునరుజ్జీవం నూరు శాతం చేస్తం: పొంగులేటి
మూసీ నది ప్రక్షాళన, పునరుజ్జీవ ప్రాజెక్టును నూటికి నూరు శాతం చేస్తామని మంత్రిపొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. హన్ నది పునరుజ్జీవ ప్రాజెక్టును సందర్శిస్తే.. పిల్ల కాలువను సందర్శిస్తారా? అని ప్రతిపక్షం విమర్శలు చేస్తున్నదన్నారు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు వీలుంటే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు సహకరించాలని.. బురదజల్లే కార్యక్రమం మాత్రం మానుకోవాలన్నారు. అందరినీ ఒప్పించి మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టును చేపడతామని వేంనరేందర్రెడ్డి ప్రకటించారు. హన్ నది అభివృద్ధి ప్రణాళిక సియోల్‌కు జీవరేఖగా ఎలా మారిందన్నది పరిశీలించామని, మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు కూడా హైదరాబాద్అభివృద్ధికి అన్ని రకాలుగా ఉపకరిస్తుందని తెలిపారు.
సియోల్ లాగే హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తం: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
హన్ నది పునరుజ్జీవం చేసిన తర్వాత సియోల్ సిటీ రూపురేఖలు మారాయని చామల కిరణ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. హన్ అభివృద్ధితో గ్లోబల్ సిటీ పోటీతత్వంలో సియోల్ ఏడో స్థానంలో ఉందన్నారు. మూసీ నదిని కూడా ప్రక్షాళన చేసి, హైదరాబాద్ మహానగరాన్ని సియోల్ లాగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.