కర్తార్​పూర్ కారిడార్ కలిపింది

కర్తార్పూర్: వాళ్లిద్దరూ అన్నదమ్ములు.. దేశ విభజన సమయంలో విడిపోయారు. ఒకరేమో ఇండియాలో ఉండిపోతే, ఇంకొకరు పాకిస్తాన్​లో స్థిరపడ్డరు. అప్పటి నుంచి ఒకరినొకరు కలుసుకోవడానికి వాళ్లకు వీలుపడలే. దాదాపు 74 ఏండ్లు గడిచినంక ఇప్పుడు అనుకోకుండా కర్తార్​పూర్​ కారిడార్​లో కలుసుకున్నారా అన్నదమ్ములు. పాకిస్తాన్​లోని ఫైసలాబాద్ నివాసి సిద్ధిక్, ఇండియన్ పంజాబ్​లోని ఫుల్లన్​వాల్ ప్రాంతానికి చెందిన హబీబ్ కర్తార్​పూర్ వెళ్లారు. ఇద్దరూ అక్కడ ఎదురుపడడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా అయింది. ఒకరినొకరు ఆత్మీయంగా కౌగిలించుకొని భావోద్వేగానికి గురయ్యారు. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. వీరు కలుసుకున్న వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరలవుతోంది. కర్తార్​పూర్​ను ఓపెన్ చేసినందుకు ఇండియా పాక్ ప్రభుత్వాలకు వారు కృతజ్ఞతలు చెప్పగా.. దేశ విభజన సమయంలో విడిపోయిన ఎంతోమంది కలిసేందుకు అవకాశముందన్నారు. గతంలోనూ ఇద్దరు స్నేహితులు కర్తార్​పూర్ పర్యటనలో కలుసుకున్నారు.