విశ్లేషణ : పేద, మిడిల్ క్లాస్ జనాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాయి. దేశవ్యాప్తంగా వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రభుత్వాలు వేలాది కోట్లు ఖర్చు చేస్తున్నాయి. 1952 నుంచే దేశంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నా.. అట్టడుగు వర్గాల స్థితిగతుల్లో మార్పు మాత్రం రావడంలేదు. అమలులో లోపాలు, జవాబుదారీతనం లేకపోవడం, గ్రౌండ్ లెవల్లో పరిస్థితుల కారణంగా అర్హులైన వారికి నేటికీ దక్కాల్సిన ఫలాలు పూర్తి స్థాయిలో అందడం లేదు. ఇన్నేండ్లలో సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అర్హులైన లబ్ధిదారులకు చేరితే దేశంలో ఇంకా ఆకలి కేకలు, పేదరికం, నిరుద్యోగం, బిక్షాటన, వలసలు ఎందుకున్నట్లు. సంక్షేమ పథకాల అమలు కోసం ప్రత్యేక వ్యవస్థ ఉంటే.. ప్రజలకు సరైన న్యాయం జరుగుతుంది.
ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం 40 వేల కోట్ల రూపాయలతో 35కు పైగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్తున్నది. అయితే వాటిలో కొన్ని పథకాలే లబ్ధిదారులకు కొంతమేరకు అందుతున్నాయి. 2018 నుంచి కొత్తగా ఆసరా పించన్ల లబ్ధిదారులను ఎంపిక చేయడం లేదు. పైగా ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య వివిధ కారణాలతో 23,846 మందిని ఈ స్కీం నుంచి తీసేశారు. కేసీఆర్ కిట్ స్కీం కింద పాప పుడితే రూ.13,000 బాబు పుడితే రూ.12,000 నగదును నాలుగు విడతల్లో లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలి. అయితే మొదటి విడత డబ్బులు మాత్రమే వేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారఖ్ పథకం కింద అర్హులైన కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లికి ఒక రోజు ముందే ఖాతాలో లక్ష రూపాయలు జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. పెండ్లై, పిల్లలు పుట్టినా ఇవ్వడం లేదు. ఇట్ల దళిత బస్తీ పథకం, దళిత బంధు పథకం, ఆపద్బంధు లాంటి ఎన్నో పథకాలకు అర్హులైన వారు అనేక మంది ఉన్నప్పటికీ వారిని గుర్తించి ఎంపిక చేయడంలో రాష్ట్ర సర్కార్ పూర్తిగా ఫెయిల్ అయితున్నది.
స్కీమ్‌ల గురించి జనాలకు చెప్తలేరు
దేశంలో 2022 నాటికి ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలని ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం’ తీసుకొచ్చారు. ఈ స్కీంలో పావర్టీ లైన్ కింద ఉన్న కుటుంబాలకు ఇల్లు కట్టుకునేందుకు అయ్యే ఖర్చులో 75 శాతం కేంద్రం 25% రాష్ట్రం భరిస్తాయని ప్రభుత్వాలు చెప్పాయి. అయితే ఈ పథకం కింద కానీ, రాష్ట్ర గృహనిర్మాణ విధానం కింద కాని తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్కో ఊరికి కనీసం ఒక్కో ఇల్లు కూడా మంజూరు కానీ పరిస్థితి. 20 వేల కోట్ల రూపాయలతో ప్రారంభించిన ‘ముద్ర లోన్ స్కీం’ ద్వారా స్వయం సహాయక బృందాలు, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందే వారికి రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు బ్యాంకు రుణసాయం చేయాలి. కానీ పేద, మిడిల్ క్లాస్ వారికి ఏ బ్యాంకు అధికారీ లోన్ ఇవ్వడం లేదు. ఈ పథకం కింద అందిన కొద్ది పాటి లోన్లు కూడా సిఫారసులు ఉన్న వారికి ఇచ్చినవే. కుటుంబ పెద్ద చనిపోతే జాతీయ కుటుంబ సహాయ పథకం( NFBS) కింద బాధిత కుటుంబానికి కేంద్రం రూ.10,000 సాయం చేస్తున్నది. అయితే దీనిపై గ్రామాల్లో అవగాహన లేక ఎక్కువ మంది లబ్ధి పొందడం లేదు. ఇలా పేదల కోసం పథకాలు ప్రవేశపెడుతున్న ఎన్నో పథకాలపై వారికి అవగాహన లేక ప్రయోజనం అందడం లేదు.
పథకాలపై పర్యవేక్షణ అవసరం
సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు తీరు ఇలాగే ఉంటే మరో 70 ఏండ్లైనా సామాన్య ప్రజలకు న్యాయం జరగదు. ఐదేండ్లకు ఒకసారి కొత్త ప్రభుత్వాలు వస్తున్నట్లుగానే సంక్షేమ పథకాల పేర్లు మారి కొత్తగా వస్తున్నాయి తప్ప ప్రజల బతుకులు మాత్రం మారడం లేదు. ఏటా వేల కోట్లు ఖర్చు పెడుతున్నా అర్హులైన వారికి అందుతున్న ప్రయోజనం అంతంత మాత్రమే. పాలనలో పారదర్శకత లేకపోవడం. లబ్ధిదారుల ఎంపిక నిష్పక్షపాతంగా జరగకపోవడం, రాజకీయ ఒత్తిడులు, సిబ్బంది కొరత, పని భారం పెరగడం, నిరక్షరాస్యత వల్ల సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రజానీకానికి చేరడం లేదు. భూరికార్డుల పర్యవేక్షణకు- రెవెన్యూ, ప్రజారోగ్యం కోసం హెల్త్, శాంతి భద్రతల కోసం పోలీసు, సాగు కోసం వ్యవసాయం ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిదానికి ఒక శాఖను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నాయి. కానీ వేలాది కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టే సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు కోసం ప్రత్యేకించి ఒక శాఖను లేదా వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయడం లేదు. పథకాల అమలు బాధ్యతను ఇతర శాఖలకు అప్పగించి ఆయా శాఖల ఉద్యోగులపై పనిభారం పెంచి వాటిని నామమాత్రంగా అమలు చేస్తున్నాయి.
ప్రత్యేక వ్యవస్థను తీసుకొస్తే మేలు
సంక్షేమ పథకాలు ప్రజలకు చేరడానికి, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ అర్హులకు వాటి ఫలాలు అందించడానికి ఒక ప్రత్యేక వ్యవస్థ కావాలని ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తించాలి. రైతులకు అందుబాటులో ఉండేందుకు ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో)ను రాష్ట్ర సర్కార్ నియమించినట్లుగా.. సంక్షేమ, అభివృద్ధి పథకాలను పావర్టీ లైన్‌కు దిగువ ఉన్న కచ్చితమైన లబ్ధిదారులకు అందించడానికి ప్రత్యేక అధికారులను నియమించాలి. రాజకీయ, సామాజిక అంశాలపై అవగాహన ఉండే సమాజ శాస్త్రం చదివిన యువతతో ప్రతి మండల కేంద్రంలో మండల సోషియాలాజికల్ఆఫీస్(ఎంఎస్‌వో)తో పాటు ఊరు స్థాయిలో గ్రామ సోషియాలాజికల్ ఆఫీసర్(వీఎస్వో) పేరుతో కొత్తగా పోస్టులను మంజూరు చేసినట్లయితే ప్రభుత్వ పథకాలు 100 శాతం అర్హులకు అంది ఆశించిన ఫలితాలు సాధించేందుకు దోహదపడుతుంది. ఈ తరహా వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత, ప్రజా భాగస్వామ్యం పెరుగుతుంది. పేద, మధ్యతరగతి ప్రజల అభివృద్ధి, శ్రేయస్సు కోసం కేటాయించే లక్షలాది కోట్ల రూపాయల ప్రజా ధనం వృథా కాకుండా ప్రభుత్వాలు ఇలాంటి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలి. లేదంటే ధనవంతులు మరింత ధనవంతులుగా.. పేదలు మరింత పేదలుగా దిగజారిపోతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలు ఆర్థికంగా, సామాజికంగా మరింత అణచివేతకు గురయ్యే ప్రమాదం ఉంటుంది.
ఎన్నికలు వస్తేనే స్కీములా?
ఎన్నికలు ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఓట్లు రాబట్టుకొని గెలుపొందాలనే ఆలోచన తప్ప అర్హులైన వారందరికీ న్యాయం చేయాలనే ధ్యాస ప్రభుత్వాలకు ఉండట్లేదు. 2013 ఏప్రిల్ నుంచి పదేండ్ల పాటు అమల్లో ఉండేలా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం తెచ్చారు. ఎస్సీ, ఎస్టీలను సామాజికంగా, ఆర్థికంగా, విద్యా రంగంలోనూ ఇతర అభివృద్ధి చెందిన వర్గాలకు సమాన స్థాయిలోకి తీసుకురావడం దీని ప్రధాన లక్ష్యం. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి టీఆర్ఎస్ సర్కార్ ఎస్సీ కార్పొరేషన్ కు 2014–15లో రూ.7,579 కోట్లు, 2015–16 రూ. 8,089 కోట్లు, 2016–17 రూ.10,184 కోట్లు, 2017–18 రూ.14,375 కోట్లు, 2018–19 రూ.16,452 కోట్లు, 2019–20 రూ.12,400 కోట్లు, 2020–21 రూ.16,534 కోట్లు కేటాయించింది. అయితే ఈ కేటాయించిన నిధులను ఎస్సీల సంక్షేమం కోసం ఉపయోగించకుండా ఇతర శాఖలకు మళ్లిస్తోంది. రాష్ట్ర సర్కార్ తీరుతో ఆ వర్గాలకు కేటాయించిన ఫండ్స్ వారికే ఖర్చు చేయాలన్న సబ్‌ప్లాన్ ఉద్దేశం నెరవేరకుండాపోయింది. సబ్‌ప్లాన్ చట్టం అమలులో ఉన్నప్పుడే న్యాయం చేయని ప్రభుత్వం ఆ తర్వాత వారిని పట్టించుకుంటుందా?. అలాగే యంత్రాలు, ట్రాక్టర్లను రైతులకు సబ్సిడీపై అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. వాటిని అధికార పార్టీ నేతలు, వారి అనుచరులకు మాత్రమే ఇస్తోంది. నిజమైన లబ్ధిదారులు, అర్హులకు మాత్రం ఇలాంటి పథకాలు అందట్లేదు.
- మానిక్ డోంగ్రే, సోషియాలజిస్టు