సెప్టెంబర్ 17 గత కాలపు పోరాటాలకు గుర్తు

నేడు తెలంగాణ విలీన దినం. సెప్టెంబర్ 17కు ఉన్న గొప్పతనం, మలి దశ ఉద్యమం మొదలయ్యే దాకా మరుగున పడిపోయింది. నేను ప్రైమరీ స్కూల్లో ఉన్న రోజుల్లో పంద్రాగస్టు వేడుకలకు హడావుడిగా తయారై వెళుతున్నా. అప్పుడు మా అమ్మ మనకు స్వాతంత్ర్య దినం లేదన్నది. నేను షాక్ అయ్యా. దేశమంతా పండుగ జరుగుతుంటే నువ్వెందుకు ఇలా అంటున్నావని అడిగా. అప్పటికింకా తెలంగాణలో నిజాం పాలన సాగుతున్నది. రజాకార్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. ఇంకెక్కడైనా స్వాతంత్ర్యం వచ్చిందేమో కానీ మనకు మాత్రం రాలేదని గట్టిగానే చెప్పింది. మా టీచర్లు చెపుతున్నదానికీ, ఊర్లో జరుగుతున్న దానిని చూస్తుంటే నాకు డౌట్ మొదలైంది. ఎవరిని నమ్మాలో తెలియలేదు. అప్పుడు నా అనుమానాలను తీర్చే వారెవరూ కనబడలేదు. మలి దశ ఉద్యమం వచ్చే దాకా అవి అలాగే మిగిలిపోయాయి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమే తెలంగాణ చరిత్రను వెలుగులోకి తెచ్చింది.

సంస్థానాల విషయంలో గందరగోళం

1948 సెప్టెంబర్ 17న సైన్యం ఆపరేషన్ పోలో పేరుతో, హైదరాబాద్ రాష్ట్రాన్ని దేశంలో విలీనం చేసింది. అప్పటికే చాలా సంస్థానాలు విలీనమయ్యాయి. కాశ్మీర్, జునాగడ్, తెలంగాణ తప్ప. స్వాతంత్ర్యం టైంలో బ్రిటీష్ పాలకులు సంస్థానాల విషయంలో గందరగోళం సృష్టించారు. ఏ దేశంలో ఉన్న సంస్థానాలు ఆ దేశంలోనే ఉంటాయని ప్రకటిస్తే సమస్య ఉండకపోను. కానీ బ్రిటీష్ పాలకులు సంస్థానాలకు అవకాశాన్ని వదిలేసినారు. స్వతంత్రంగా ఉండవచ్చు లేక ఇండియాలో కానీ పాకిస్తాన్ లో కాని చేరవచ్చని అవకాశం ఇచ్చారు. అయితే ప్రజా ఉద్యమాలతో చాలావరకు సంస్థానాలు దేశంలో విలీనమయ్యాయి. కేంద్రం కూడా పరిస్థితిని జాగ్రత్తగా అంచనా వేసి, వ్యూహాత్మకంగా వ్యవహరించి దేశాన్ని ఏకం చేయగలిగింది.

నిజాం ఆలోచన ఎవరూ పసిగట్టలేదు

నిజాం రాజు తనకు దొరికిన చాన్స్​ వాడుకుందామని ఆలోచించాడు. రజాకార్ల ఒత్తిడి వల్ల అట్లా చేసిండా? బ్రిటీష్ పాలకుల మద్దతు దొరుకుతుందని ఆశించాడా? హైదరాబాద్ సొంత రాష్ట్రంగా నిలబడగలదని నమ్మాడా? పై మూడు వాస్తవమే. కానీ బ్రిటీష్ పాలకులు నిజాం ప్రభువుకు మద్దతివ్వలేదు. నమ్మిన బంటుగా ఉన్న నిజాంను మోసం చేశారని ఆయన మద్దతుదార్లు బ్రిటీష్ పాలకులపై విరుచుకుపడ్డారు. ఈ సమయంలో దేశంలో విలీనం కావాలని అనేకమంది నిజాం రాజుకు సలహా చెప్పిన్రు. వీరిలో హైదరాబాద్​కు చెందిన ముస్లిం పెద్దలు ఉన్నారు. కానీ ఈ ప్రయత్నాలను రజాకార్లు అడ్డుకున్నారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని కాపాడటానికి సాయుధులు కావాలని పిలుపునిచ్చారు. అయితే నిజాం ఆలోచన ఏమిటన్నది ఎవరూ పసిగట్ట లేకపోయారు.

నాన్​ ముల్కీ అధికారులే పెత్తనం

ఉద్యమాల వల్ల నిజాం రాజు బలహీనమవడంతో పోలీస్ యాక్షన్ విజయవంతమైంది. రజాకార్ల రాక్షసత్వం నుండి పీడా విరగడైందని సైనికులకు ప్రజలు ఆహ్వానం పలికినారు. కానీ, పోలీస్ యాక్షన్ తర్వాత అధికారం ప్రజల చేతుల్లోకి రాలేదు. కొంతకాలం మిలిటరీ, కొంతకాలం అధికారుల పాలన సాగింది. వాస్తవానికి అధికారం చెలాయించింది ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చిన నాన్-ముల్కీ అధికారులే. వారు మన అస్తిత్వంపై దాడి చేయడమే కాక ఇక్కడి నుంచి పారిపోయిన ముస్లింల ఆస్తులను, రజాకార్లు దోచుకున్న నగదు, నగలను కైవసం చేసుకున్నారు. 1952లో ప్రజాస్వామ్య విస్తరణ కోసం ఒకవైపు, మన అస్తిత్వంపై దాడికి దిగిన ప్రాంతేతర పాలకులపై మరోవైపు సమాంతరంగా ఉద్యమాలు సాగుతూ వచ్చాయి.

విలీన దినం జరుపుకోవడం ఇప్పటికీ అవసరమే

విలీన దినాన్ని జరుపుకోవడమంటే తెలంగాణలో సాగిన, సాగుతున్న ప్రజాస్వామిక ఉద్యమ విలువలను ముందుకు తీసుకు వెళ్లటానికి ప్రయత్నించడమే. తెలంగాణ ప్రయాణాన్ని ముందుకు నడిపించడమే. అది ఇప్పటికీ అవసరమే. ఒకవైపు ఆంధ్రా కాంట్రాక్టర్లు, కార్పొరేట్ల దోపిడీపై మన ఉద్యమం సాగాలి. మరోవైపు నిత్య జీవితంలో ప్రజాస్వామిక విలువల ప్రతిష్టాపనకై ప్రయత్నం జరుగుతుండాలి. ఈ అవసరాన్ని నాగులు ఆత్మహత్య ఉదంతం మరోసారి బలంగా ముందుకు తెచ్చింది. సెక్యురిటీ గార్డుగా పనిచేసిన నాగులు ఉద్యోగాన్ని వదులుకుని తెలంగాణ కోసం కొట్లాడిండు. రాష్ట్రం వచ్చినాక తన పని తాను చేసుకొంటున్నాడు. ఉద్యమకాలంలో ఆంధ్రా పాలకుల పంచన చేరి తమ వ్యాపారాలు, ఆస్తులను కాపాడుకున్న వారే టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు, మంత్రులయ్యారు. ఉద్యమకారులు పక్కకు పోయారు. వారి కనీస ఆకాంక్షలు నెరవేరకపోగా.. బతుకు దెరువు గానీ, తమకున్న కొద్దిపాటి ఆస్తులకు కానీ రక్షణ లేకుండా పోయింది.

ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్న జనం

కరోనాతో నాగులు ఉద్యోగం కోల్పోయిండు. ప్రభుత్వం కూడా సాయం చేయలేదు. ఆ తర్వాత ఉద్యోగం దొరికినా సగం జీతమే(రూ.6 వేలే) వచ్చింది. కుటుంబాన్ని పోషించలేక అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ పరిస్థితుల వల్ల జనం ఇబ్బందులు పడుతున్నారు. చిన్న రైతులదీ ఇదే పరిస్థితి. అసైన్డ్ భూములున్న రైతులను, సాదా బైనామాలు ఉన్న రైతులను, ప్రభుత్వ, అటవీ భూములను దున్నుకుంటున్న రైతులను బలవంతంగా బేదఖలు చేస్తున్నారు. తమ హక్కులను కాపాడేవారు కనపడక రైతులు ఆవేదన పడుతున్నారు. సకాలంలో రికార్డులు దొరకక, ఆందోళనతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో విలీన దినం జరుపుకోవడమంటే గత కాలపు ప్రజాస్వామిక పోరాటాలను గుర్తు చేసుకోవడం. ఆ వెలుగులో ప్రజాస్వామిక విలువలను విస్తరించడానికి ప్రయత్నం చేయడం. ఆ లక్ష్యం కోసమే సెప్టెంబర్ 17న విలీనదినాన్ని జరుపుకుందాం.

ప్రజా ఉద్యమాలే కారణం

అప్పటికే నిజాం బలహీనమైపోయాడు. దానికి తెలంగాణలో వచ్చిన ప్రజా ఉద్యమాలే కారణం. ఈ ఉద్యమాలు బలపడటానికి రెండు కారణాలున్నాయి. అంతర్గత, సామాజిక, ఆర్థిక పరిస్థితులు ప్రజలను ఉద్యమాలవైపు నడిపించాయి. 19వ శతాబ్దం చివరిలో అప్పటి ప్రధాని మొదటి సాలార్ జంగ్ భూ సంబంధాల్లో తెచ్చిన సంస్కరణలు కూడా పరోక్షంగా కారణమయ్యాయి. సర్వే చేసి వాస్తవ సాగుదార్లకు పట్టాలివ్వాలనుకున్నా ఆచరణలో జరిగింది వేరు. భూమి శిస్తు వసూలు చేసి, రాజుకు కొంత చెల్లించి మిగిలింది ఉంచుకునే సర్బస్తా అనే వర్గం భూయజమానులయ్యారు. రాజుగారికి సేవలందించినందుకు మరికొందరికి జాగీర్లు ఇచ్చినారు. రైతులు, వివిధ వృత్తులు చేసుకునే జనం ఈ వ్యవస్థను వ్యతిరేకించారు. ఎందుకంటే ఫ్యూడల్ ప్రభువులు ప్రజల చేత వెట్టి చేయించారు. వాళ్ల శ్రమ దోచుకున్నారు. ఈ దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు స్వాతంత్రోద్యమం స్ఫూర్తినిచ్చింది.

మూడు రకాల పోరాటాలు

1920 తర్వాత ఎదిగిన విద్యావంతులు ముందు ఆంధ్ర జనసంఘం, ఆ తర్వాత ఆంధ్ర మహాసభలో పని చేసి రాజకీయాల్లోకి వచ్చారు. వీరు మూడుగా విడిపోయారు. మొదటిది, బలమైనది, కమూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సాయుధ పోరాటం. రెండవది సోషలిస్టుల ఆధ్వర్యంలో సాగిన భూస్వామ్య వ్యతిరేక పోరాటం. మూడవది కాంగ్రెస్ నేతృత్వంలో ప్రాతినిథ్య ప్రభుత్వం కోసం జరిగిన పోరాటం. ఒక ఉద్యమం రాజకీయ రంగంలో ప్రజాస్వామ్యాన్ని కోరితే.. మిగతా రెండు ఫ్యూడల్ దోపిడీ పోకుండా ప్రజాస్వామ్యం రాదని నమ్మాయి. ఈ ఉద్యమాలు ఏదో ఒక స్థాయిలో సాయుధ పోరాట మార్గంలో సాగాయి. ఈ పోరాటాల వల్ల ప్రజల్లో నిజాం మద్దతు కోల్పోయాడు. ఫ్యూడల్ వ్యతిరేక పోరాటాల్లో ముస్లింలు కూడా పాల్గొన్నారు. ఈ ఉద్యమాలకు వ్యతిరేకంగా రాచరిక వ్యవస్థను కాపాడటానికి జరిగిన ప్రయత్నమే రజాకార్లు. ఇందులో ముస్లింలతోపాటు హిందూ ఫ్యూడల్ ప్రభువులూ పాల్గొన్నారు.

–  ప్రొఫెసర్ కోదండరాం,తెలంగాణజన సమితి చీఫ్