సెప్టెంబర్ -17 : ‘పాత గాయాలా’.. అదెట్ల?

తెలంగాణ చరిత్రలో హైదరాబాద్​ సంస్థానం విలీనానికి ఎంతో  ప్రాధాన్యముంది. ఇండియాలో విలీనం కావడానికి  అప్పటి నైజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అంగీకరించకపోవడంతో సమస్య వచ్చింది. నైజాం స్టేట్ ప్రజలు మాత్రం సంస్థానాన్ని ఇండియాలో విలీనం చేయాలని కోరుకున్నారు. దీంతో  జవహర్ లాల్ నెహ్రూ  ప్రభుత్వం సైనిక చర్యకు రెడీ అయింది. అప్పటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో  సైన్యం ‘ ఆపరేషన్ పోలో’  జరపడంతో నైజాం నవాబు లొంగిపోయాడు.

తర్వాత  హైదరాబాద్ సంస్థానం ఇండియాలో విలీనమైంది. ఇదీ విలీనం చరిత్ర. హైదరాబాద్ సంస్థానం విలీనంలో ఎక్కడా మతపరమైన అంశాల్లేవు. కానీ బీజేపీ ఇప్పుడు ఈ విలీనం అంశానికి మతపరమైన రంగు పూసి రాజకీయంగా ఉపయోగించుకోవాలని  ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే రాజకీయపరమైన కార్యక్రమాలను బీజేపీ ఏర్పాటు చేసింది. ఏ పార్టీ అయినా రాజకీయంగా బలపడటాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ ఇక్కడ బీజేపీ చేస్తోంది వేరు. ప్రజలను మతపరంగా చీల్చి, ఇతర పార్టీలకు చెందిన లీడర్లను తమ పార్టీలోకి చేర్చుకుని పొలిటికల్ గా బలపడాలని బీజేపీ చూస్తోంది. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు.

1948 నుంచి 56 వరకు సంబురాలు

విలీనం తర్వాత  హైదరాబాద్ రాష్ట్రంలో 1948 నుంచి 56 వరకు అధికారికంగా సంబురాలు జరిగాయి. 1956 లో  ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వేడుకలు నిర్వహించలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాత్రం పార్టీ పరంగా సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఎగురవేసి వేడుకలు నిర్వహించేవారు. ఆ తర్వాత అనేక పరిణామాలు సంభవించాయి. తెలంగాణ  ప్రత్యేక రాష్ట్రం కోసం కల్వకుంట్ల చంద్రశేఖర రావు టీడీపీకి రాజీనామా చేసి ‘ తెలంగాణ రాష్ట్ర సమితి ’ పేరుతో పార్టీని ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇక్కడి  ప్రజల ఆశయాలను గౌరవిస్తూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2014 జూన్ రెండున  తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అధికారికంగా వేడుకలు నిర్వహిస్తామని ఉద్యమ సమయంలో చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ తర్వాత మాట మార్చారు. ‘పాత గాయాలు ’ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.  హైదరాబాద్ సంస్థానం ఇండియాలో విలీనం అయిన సెప్టెంబర్ 17న కచ్చితంగా ఒక వేడుకలా  సెలబ్రేట్ చేసుకోవాలి.

చరిత్రను వక్రీకరించవద్దు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ జూన్ రెండో తేదీనే విలీనం, విమోచన అంటూ కేసీఆర్ మాట్లాడడం అంటే చరిత్రను వక్రీకరించినట్టే. ఒకప్పుడు వేడుకల నిర్వహణ విషయంలో ఇతర పార్టీలను విమర్శించిన కేసీఆరే ఇప్పుడు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అధికారికంగా  వేడుకలు నిర్వహించి, తెలంగాణ ఉద్యమకారులను గౌరవించుకోవడం మన కనీస ధర్మం. ఒకప్పుడు వేడుకలను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆరే ఇవాళ  ఆ విషయాలను తప్పించుకుంటూ మాట్లాడితే ఇక ఆ మాటలకు విలువ ఏముంటుంది ? తెలంగాణ విలీన దినోత్సవాన్ని  ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే  తెలంగాణ ఉద్యమకారులు, అప్పటి పోరాట యోధుల వారసులు ఎంతో సంతోషిస్తారు. లేకపోతే మరోసారి మాట తప్పిన నేతలుగా టీఆర్ ఎస్ నాయకులు చరిత్రలో నిలిచిపోతారు.

పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్