సెప్టెంబర్ 17, 1948. చరిత్ర తెలియని వారికి ఈ తేదీ ప్రాధాన్యం పెద్దగా తెలియకపోవచ్చు, చరిత్ర తెలిసిన వారి మనసు భావోద్వేగంతో నిండిపోతుంది. హైదరాబాద్ సంస్థానం (తెలంగాణ)ని ఏడు తరాలపాటు నిజాం నవాబులు పట్టిపీడించారు. నిజాం నిరంకుశ పాలనపై వీరోచిత తిరుగుబాటు జరిగింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడ్డ బలహీన, దళిత, గిరిజన వర్గాలు భూమికోసం, భుక్తి కోసమే కాకుండా ఆత్మాభిమానం ప్రాతిపదికన ఉద్యమించారు. హైదరాబాద్ సంస్థానంలో జాతీయోద్యమ నిర్మాణం పత్రికలు, సాహిత్యం, కళారూపాల్లో కూడా సాగింది. ఆంధ్రోద్యమం, గ్రంథాలయోద్యమం, ఆంధ్ర మహాసభ నిర్వహణోద్యమం, స్టేట్ కాంగ్రెస్ ఉద్యమం, ఆర్యసమాజ ఉద్యమం, విద్యార్థుల వందేమాతర ఉద్యమం, కమ్యూనిస్టులు, సోషలిస్టుల ఉద్యమం, హిందూ మహాసభ ఉద్యమం వేర్వేరుగా సాగినా… అన్నిటి లక్ష్యం ఒక్కటే, నిజాం చెరనుంచి విమోచన పొందడం. వీటితోపాటుగా వెట్టిచాకిరీ నిర్మూలన, స్వదేశీ ఖద్దరు వినియోగం, అంటరానితనం నిర్మూలన, స్త్రీ విద్య, సహపంక్తి భోజనాలు, వరకట్నం, మద్యపాన వ్యతిరేకం వంటివి ప్రజలను సంఘటిత పరిచాయి. ఈ ఉద్యమాలు నైజాం సర్కారును ఉక్కు మనిషి సర్దార్ పటేల్ ముందు తలవంచేలా చేశాయి.
సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో వట్టెం నరహరి కవి నిజాం దురంతాల్ని, సంస్థానం బాధల్ని కళ్లకు కట్టించి కర్తవ్యాన్ని నిర్దేశించారు. గోలకొండ పత్రికలోనూ, కవుల సంచికలోనూ ‘నాజీల మించినవ్రో నైజాం సర్కరోడా… గోల్కొండ ఖిల్లా కింద నీ గోరి కడ్తం కొడుకో..’ తదితర ఉద్యమ గీతాలు యావత్ తెలంగాణను చైతన్య పరిచాయి.
68 ఏళ్ల క్రితం దేశం నడిబొడ్డున సర్జరీ జరిగి క్యాన్సర్ లాంటి నిజాం పాలన తొలగింది. 1948 సెప్టెంబర్ 17 నాడు ఫ్యూడల్ భావాలున్న హైదరాబాద్ సంస్థానం కాలగర్భంలో కలిసింది. ఇక్కడి ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు పొందారు. ఇది వాస్తవం. మరి, తెలంగాణ విమోచన ఉత్సవాలు ఎందుకు జరపరు? దేశ చరిత్రలో 1947 ఆగస్టు 15వ తేదీకి ఎంత ప్రాధాన్యం ఉందో, తెలంగాణ విమోచనం జరిగిన 1948 సెప్టెంబర్ 17కూ అంతే ప్రాముఖ్యం ఉంది. ఈ రెండూ స్వాతంత్య్ర దినోత్స వాలే. దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రజలు 70 ఏళ్లుగా ఈ ఉత్సవాలకు నోచుకోలేక పోతున్నారు. 1956 నవంబర్ 1వ తేదీన నిజాం నుండి విమోచన లభించిన హైదరాబాద్ సంస్థానంలోని తెలుగు నేలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, మరాఠ్వాడా ప్రాంతాన్ని బోంబే స్టేట్ (మహారాష్ట్ర)లోనూ, కర్ణాటక ప్రాంతాన్ని మైసూర్ స్టేట్‌లోనూ విలీనం చేశారు. ప్రతి ఏటా సెప్టెంబర్ 17నాడు మహారాష్ట్ర, కర్ణాటకల్లోని పాత హైదరాబాద్ (నిజాం రాజ్యం) భూభాగాల్లో విమోచన వేడుకలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తున్నాయి. కానీ, ప్రధాన భాగమైన తెలంగాణ గడ్డ మాత్రం ఈ అదృష్టానికి దూరంగా ఉండిపోయింది.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఓటు బ్యాంక్ రాజకీయాలు, రకరకాల లెక్కలతో విమోచన ఉత్సవాలను ఆదిలోనే అటకెక్కించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే మార్గంలో కొనసాగుతోంది. తెలంగాణ ఏర్పడి, స్వయానా చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి అయ్యాక, హామీని నిలుపుకోవడానికి జంకుతున్నారు. అందుకు కారణం క్లియర్‌గానే ఉంది. ఆనాటి రజాకార్ల పార్టీ మజ్లిస్‌తో కేసీఆర్ పార్టీ టిఆర్ఎస్ స్నేహం మొదలుపెట్టింది. హైదరాబాద్ విమోచన ఉత్సవాలు నిర్వహిస్తే మజ్లిస్ నొచ్చుకుంటుందని టిఆర్ఎస్ భయం. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మొండి పట్టుదలకు పోతున్నట్లు? ఈ వేడుకలను అధికారికంగా నిర్వహించకపోతే దాశరథి రంగాచార్యులు, కాళోజీ నారాయణరావు లాంటివారిని విస్మరించినట్లవుతుందన్నది వాస్తవం.
కొట్టె మురళీకృష్ణ,
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు