హైదరాబాద్, వెలుగు: సెప్టెంబర్ 17 సందర్భంగా టీడీపీ నేతలు మంగళవారం హైదరాబాద్ లోని ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ విలీన దినోత్సవం నిర్వహించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం టీడీపీ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ..‘‘సెప్టెంబర్ 17 నిజాం నిరంకుశత్వానికి చరమగీతం పాడి కోట్లాది మంది ప్రజలకు స్వేచ్ఛ లభించిన రోజు. బానిస బతుకుల నుంచి విముక్తి కలిగించడానికి సాయుధ పోరాటం జరిగింది. నిజాం పాలనలో ఆర్థిక దోపిడికి వ్యతిరేకంగా రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల కమలాదేవి, మగ్దూం మొహియుద్దీన్, చాకలి ఐలమ్మ వంటి అనేక మంది పోరాడారు. రజాకార్లపై జరిగిన పోరులో 4 వేల మంది అమరులయ్యారు. సెప్టెంబర్ 17 స్ఫూర్తితో ప్రజలలోకి వెళ్లి తెలుగు దేశం పార్టీని మళ్లీ బలోపేతం చేసుకుందాం" అని నర్సిరెడ్డి పేర్కొన్నారు.