విమోచనంపై ఫొటో ఎగ్జిబిషన్

  • సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్​లో ప్రారంభించిన బండి సంజయ్

  • తెలంగాణ సాయుధ పోరాటంపై 3 రోజులు ఎగ్జిబిషన్  

హైదరాబాద్/సికింద్రాబాద్, వెలుగు:తెలంగాణ విమోచన ఉద్యమంపై సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్​లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్​ను ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. సెంట్రల్​బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, కేంద్ర సమాచార శాఖ​ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్​లో నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తి చేసేందుకు పోరాడిన కుమ్రం భీమ్, చాకలి ఐలమ్మ, స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి ప్రముఖుల ఫొటోలను ఏర్పాటు చేశారు. పార్కల్ ఊచకోత, బైరాన్​పల్లి ఘటన, రజాకార్ల దౌర్జన్యాలు, ఆపరేషన్ పోలో వంటి ప్రధాన ఘట్టాలను వివరించే ఫొటోలు కూడా ప్రదర్శనకు ఉంచారు. ఎగ్జిబిషన్​ఈ నెల17 వరకు మూడు రోజుల పాటు కొనసాగుతుంది. కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్, పార్టీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

ప్రజాపాలన కాదు.. ప్రజా వంచన.. 

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పేరిట వేడుకలు నిర్వహిస్తోందని, అలా కాకుండా తెలంగాణ ప్రజా వంచన దినోత్సవం జరుపుకోవాలని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విమోచన దినోత్సవం నిర్వహించకుండా ప్రజలను వంచించినందుకు.. తెలంగాణ ప్రజా వంచన దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలను రాచిరంపాన పెట్టిన రజకార్ల పార్టీ వారసులకు కాంగ్రెస్ వత్తాసు పలకడం సిగ్గు చేటన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవంపై అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకోలా కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు.