
ఆధ్యాత్మిక నగరం.. తిరుపతిలో వినాయక నిమజ్జన కార్యక్రమానికి టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తుందని టీటీటీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. అయితే సెప్టెంబర్ 22 వ తేదీన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ కార్యక్రమం ఉన్నందున ఆ రోజు నిమజ్జన కార్యక్రమాలు లేకుండా చూసుకోవాలని వినాయక నిమజ్జన కమిటీ ప్రతినిధులకు, అధికారులకు ఆయన సూచించారు. వినాయకసాగర్ వద్ద భక్తులకు తిరుచానూరి శ్రీ పద్మావతి అమ్మవారి కుంకుమ ప్రసాదం, కంకణాలు అందిస్తామన్నారు.
వినాయక చవితి సందర్బంగా వినాయక సాగర్ దగ్గర టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధార్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి. తిరుపతి నగర పాలక సంస్థ అధికారికంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తుందన్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం పోలీస్, తుడ, రెవెన్యూ, ఎస్పీడీసీఎల్ ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని చైర్మన్ శ్రీకరుణాకర రెడ్డి చెప్పారు.
వినాయకుడి విగ్రహాలను వినాయకసాగర్ లో నిమజ్జనం చేసే ఆనవాయితీ ఉందని... అయితే గరుడసేవ ( సెప్టెంబర్22) రోజు ఈ కార్యక్రమాన్ని మరో రోజు పెట్టుకోవాలని వినాయక ఉత్సవ కమిటీలను టీటీడీ చైర్మన్ కోరారు. ఈ ఏడాది (2023) శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని భూమన కరుణాకరరెడ్డి తెలిపారు.