సెప్టెంబర్ నెలలో పండుగలు ఇవే..

సెప్టెంబర్ నెలలో పండుగలు ఇవే..

భారతదేశం పండుగలకు నెలవు అన్న విషయం తెలిసిందే. ప్రతి నెలా ఏదో ఒక పండుగను జరుపుకుంటారు. సెప్టెంబర్ నెలలో ముఖ్యమైన పండగలు రాబోతున్నాయి.  ఈ నెలలో గణేష్ చతుర్థి , కృష్ణాష్టమి  ఇతర పండుగలు జరుపుకుంటున్నాము.  ఈ నెలలో శ్రద్ధ పక్షం కూడా ప్రారంభమవుతుంది. పూర్వీకుల సమర్పణకు శ్రద్ధా కాలం ముఖ్యమైనది. సెప్టెంబర్ నెలలో వచ్చే పండుగల జాబితా మీ కోసం.

సెప్టెంబర్ 2 సంకటహర చతుర్థి

సంకటహర చతుర్థి అంటే మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి ‬వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చతుర్థి.. శ్రావణ మాసం కృష్ణపక్షంలో  వచ్చే ఈ చతుర్థికి మరింత ప్రత్యేకత ఉందని పండితులు చెబుతున్నారు. శ్రావణ మాసం అంటే మహిళలు చాలా ప్రత్యేకంగా చూస్తారు. పూజలు, నోములు, శుభకార్యాలతో సందడి చేస్తారు. దీనికి తోడు ఎంతో పవిత్రమైనదిగా భావించే సంకటహర చతుర్ధి దీంతో భక్తులంతా ఈ పూజకు సిద్ధమవుతున్నారు

సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం​​​​​​

అజ్ఞానమనే చీకటిలో ఉన్న వారిని విజ్ఞానమనే మార్గంలో నడిపించే ఏకైక వ్యక్తి గురువు/టీచర్ (Teacher). ఏ దానం చేసినా కరిగిపోతుంది కానీ విద్యాదానం చేస్తే అది చచ్చిపోయేంత వరకు వారితోనే ఉంటుంది. అలాంటి గొప్ప దానాన్ని చేసే ఉపాధ్యాయుడిని సాక్షాత్తు ఆ పరబ్రహ్మతో పోల్చారు పెద్దలు. జీవితంలో స్థిరపడడానికి, జీవితాన్ని గొప్పగా కొనసాగించడానికి విలువైన పాఠాలునేర్పించడంలో గురువుల తర్వాతే ఎవరైనా. అందుకే ఉపాధ్యాయులను స్మరించుకోవడానికి, గౌరవించడానికి సెప్టెంబర్ 5వ తేదీని ఎంపిక చేశారు. భారతదేశవ్యాప్తంగా ఈ తేదీన విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు ధన్యవాదాలు చెబుతారు. 

సెప్టెంబర్ 6,  7 ( రెండు రోజులు)  శ్రీకృష్ణ జన్మాష్టమి

శ్రీకృష్ణాష్టమి అనగా కృష్ణుడు పుట్టిన రోజు.   ఈ రోజున తెల్లవారుజామున కాలకృత్యాలు తీర్చుకొని ... స్నానం చేసేటప్పుడు నీటిలో తులసి ఆకులు.. గంధం పొడి, పసుపు వంటివి వేసుకొని అభ్యంగ స్నానం చేయాలి.  తరువాత శ్రీకృష్ణుని పూజించి ఉపవాసంఉండాలి.  సూర్యాస్తమయం.. ప్రదోషకాలంలో దేవాలయాలకు వెళ్లి.. కృష్ణుని పూజిస్తూ.. భజన సంకీర్తనలు చేయాలి.  ఆ తరువాత శ్రీకృష్ణుని లీలలను స్మరించుకోవాలి .  ఆ తరువాత దహీదండీ ( పెరుగు, వెన్న నింపిన మట్టి కుండలను పగులకొట్టడం) వంటి ప్రత్యేక కార్యక్రమాలు చేయాలి. ఆ తరువాత శ్రీకృష్ణుడిని షోడశోపచారాలతో పూజించి .. లడ్డూ, పెరుగు, వెన్న వంటివి నివేదించాలి

సెప్టెంబర్ 14 పోలాల అమావాస్య

 శ్రావణ మాసం అమావాస్యను పోలాల అమావాస్య అంటారు.  ఈ అమావాస్యకు ఎంతో విశిష్టత వుంది. స్త్రీలు తమ సౌభాగ్యం కోసం తమ పిల్లల యోగ క్షేమాల కోసం తమ కుటుంబంకోసం వ్రతాలు ఆచరించడం మనకు అనాది నుంచి వస్తున్న ఆచారం... ఈ 'పోలాల అమావాస్య వ్రతం' ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్ధేశించబడినది. పెళ్లయి చాలాకాలానికి కూడా సంతానం కలుగని స్త్రీలు సంతానవతులైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి, ఈ వ్రతాన్ని శ్రావణ శుద్ధ బహుళ అమావాస్యనాడు చేసుకోవాలి.

సెప్టెంబర్ 19 వినాయక చవితి

మన హిందూ పండుగలలో అత్యంత విశిష్టమైన పండుగ వినాయక చవితి. చిన్నా పెద్దా కుటుంబమంతా కలిసి భగవంతుని ఆరాధించే పండుగ వినాయక చవితి. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితి పండుగను జరుపుకుంటారు. గణపతి తండ్రి శంకరుని భోళాశంకరుడని అంటారు. ఒక చెంబెడు నీళ్ళతో అభిషేకించి, కాసిని బిల్వ దళాలను, తుమ్మి పూలను సమర్పించి, చేతులెత్తి భక్తితో నమస్కరించి వేడుకున్ననే శంకరుడు సంతుష్టుడవుతాడు.తండ్రికి మించిన తనయుడు వినాయకుడు. వినాయకుడి పూజకు స్వర్ణ పుష్పాలు అవసరం లేదు. పంట పొలాల్లో లభించే మట్టితో బొమ్మను చేసి, పొలాల గట్టున లభించే అనేక రకాల ఆకులతో, జిల్లేడు, తుమ్మి, లాంటి పూలతో పూజిస్తే చాలు.గణేశుని పూజకు 21 పత్రాలను వాడతారు. ఎన్నో ఔషధ విలువలు ఉన్న మొక్కలను సామాన్యులకు పరిచయం జేయడమే వినాయక చవితి పండుగను నాడు చేసే పత్రి పూజయొక్క ప్రధాన ఉద్దేశ్యం. అవకాశం ఉన్న చోట, పత్రిని కొనడం కన్నా, పిల్లలు స్వయంగా సేకరించేటట్లుగా ప్రోత్సహించడం మంచిది.


సెప్టెంబర్ 28 గణేష్ నిమజ్జనం

మహాగణపతి ఆరాధనతో పకృతి పులకిస్తుంది. ప్రకృతి ధర్మాన్ని మానవాళి మరచిపోకుండా ఉండేందుకే ఏడాదికొకసారి మహాగణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు.  మట్టిని సస్యశ్యామలం చేయడంలో ప్రేరణశక్తిగా ఉన్నాడో ఆ గణపయ్యని శ్రద్ధతో పూజించడమే ముఖ్య ఉద్దేశం. మహాగణపతి అంటే పెద్ద పెద్ద రంగు రంగుల విగ్రహాలు కాదు.. మట్టితో తయారు చేసిన స్వచ్ఛమైన రూపం. నవరాత్రుల తర్వాత వినాయక ప్రతిమను సమీపంలో చెరువులోనో,  కుంటలోనూ నిమజ్జనం చేస్తారు. కుంటలు లేని చోట బావిలోనే నిమజ్జనం చేయవచ్చు. 21 రకాల పత్రి, ప్రతిమలోని మట్టి నీటిలో కలిశాక...  ఔషధ గుణాలున్న ఆల్కలాయిడ్స్ ను జలంలోకి వదిలేస్తాయి. ఈ ఆల్కలాయిడ్స్ వల్ల నీళ్లలోని ప్రమాదకరమైన బాక్టీరియా నశిస్తుంది. అంతేకాదు, ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇదే వినాయక నిమజ్జనం వెనుక దాగున్న పర్యావరణ పరమ రహస్యం.