నొవాక్‌ పచాస్‌..50వ సారి గ్రాండ్‌స్లామ్‌ సెమీస్‌కు జొకోవిచ్‌

 నొవాక్‌ పచాస్‌..50వ సారి గ్రాండ్‌స్లామ్‌ సెమీస్‌కు జొకోవిచ్‌
  • ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్  ఫైనల్లో అల్కరాజ్‌‌కు చెక్‌‌

మెల్‌‌బోర్న్‌ ‌: సెర్బియా సూపర్‌‌ స్టార్‌‌ నొవాక్‌‌ జొకోవిచ్‌‌.. ఆస్ట్రేలియన్‌‌ ఓపెన్‌‌లో మరోసారి మెరుపులు మెరిపించాడు. మంగళవారం జరిగిన మెన్స్‌‌ సింగిల్స్‌‌ క్వార్టర్‌‌ఫైనల్లో ఏడోసీడ్‌‌ జొకో 4–6, 6–4, 6–3, 6–4తో మూడోసీడ్‌‌ కార్లోస్‌‌ అల్కరాజ్‌‌ (స్పెయిన్‌‌)పై గెలిచి 12వ సారి సెమీస్‌‌లోకి అడుగుపెట్టాడు. ఫలితంగా ఫెడరర్‌‌ (15) తర్వాతి ప్లేస్‌‌లో నిలిచాడు. 25వ గ్రాండ్‌స్లామ్, 11వ ఆస్ట్రేలియన్‌‌ ఓపెన్‌‌ టైటిల్‌‌కు రెండు అడుగుల దూరంలో నిలిచిన జొకో కెరీర్‌‌లో ఇది 50వ గ్రాండ్‌‌ స్లామ్‌‌ సెమీస్‌‌ కావడం విశేషం. ఆల్‌‌టైమ్‌‌ రికార్డులో ఫెడరర్‌‌ (46) కంటే ముందున్నాడు.  

3 గంటలా 37 నిమిషాల పోరాటంలో ఎడమ తొడ గాయం ఇబ్బందిపెట్టినా 37 ఏళ్ల జొకోవిచ్‌‌ తన ట్రేడ్‌‌ మార్క్‌‌ షాట్లతో ఆకట్టుకున్నాడు. తొడకు పెద్ద స్ట్రాప్‌‌ చుట్టుకుని 21 ఏళ్ల అల్కరాజ్‌‌ కొట్టిన ప్రతి షాట్‌‌కు బదులిచ్చాడు. ఆరంభంలో అల్కరాజ్‌‌ ఆధిపత్యం చూపెట్టినా తర్వాతి మూడు సెట్లలో మాత్రం జొకో అనుభవాన్ని ఉపయోగించాడు. నాన్‌‌ స్టాప్‌‌గా జరిగిన యాక్షన్‌‌ థ్రిల్లర్‌‌లో ఇద్దరు అద్భుతమైన షాట్స్‌‌తో అలరించారు. నాలుగో సెట్‌‌లో జొకో 5–2 ఆధిక్యంలో ఉన్నప్పుడు అల్కరాజ్‌‌ బ్రేక్‌‌ పాయింట్‌‌ను కాపాడుకున్నాడు. వెంటనే తన సర్వీస్‌‌లో జొకో 33 స్ట్రోక్స్‌‌ ర్యాలీ ఆడాడు. 

చివరకు ఓ బలమైన ఫోర్‌‌హ్యాండ్‌‌ లాంగ్‌‌ షాట్‌‌తో మ్యాచ్‌‌ పాయింట్‌‌ను సాధించడంతో ఒక్కసారిగా రాడ్‌‌ లేవర్‌‌ ఎరీనా జొకో నామస్మరణతో ఊగిపోయింది. జొకో కోర్టులో వంగి గర్జించగా, అల్కరాజ్‌‌ తనటవల్‌‌ను బాక్స్‌‌పై వేసి చిన్నగా నవ్వుతూ ముందుకు సాగాడు. మరో సెమీస్‌‌లో రెండోసీడ్‌‌ అలెగ్జాండర్‌‌ జ్వెరెవ్ (జర్మనీ) 7–6 (7/1), 7–6 (7/0), 2–6, 6–1తో టామీ పాల్‌‌ (అమెరికా)ను ఓడించి జొకోతో సెమీస్‌‌ పోరుకు రెడీ అయ్యాడు. విమెన్స్‌‌ క్వార్టర్‌‌ఫైనల్లో టాప్‌‌సీడ్‌‌ అరీనా సబలెంకా (రష్యా) 6–2, 2–6, 6–3తో అనస్తాసియా పావ్లుచెంకోవా (రష్యా)పై 

ఓడించి వరుసగా మూడో ఆస్ట్రేలియన్‌‌ ఓపెన్‌‌ టైటిల్‌‌ వేటలో మరో అడుగు ముందుకేసింది. మరో మ్యాచ్‌‌లో పౌలా బడోసా (స్పెయిన్‌‌) 7–5, 6–4తో కోకో గాఫ్‌‌ (అమెరికా)పై నెగ్గింది. మిక్స్‌‌డ్‌‌ డబుల్స్‌‌ క్వార్టర్స్‌‌లో ఇండియా స్టార్  రోహన్‌‌ బోపన్న–షువై జాంగ్‌‌ (చైనా) 6–2, 4–6, 9–11తో జాన్‌‌ పీర్స్‌‌–ఒలివా గాడెకి (ఆస్ట్రేలియా) చేతిలో ఓడారు. గంటా 8 నిమిషాల మ్యాచ్‌‌లో బోపన్న ద్వయం గట్టిగా పోరాడినా సూపర్‌‌ టైబ్రేక్‌‌లో నిరాశపర్చింది.