కాశ్మీర్‌లో వలస కార్మికులపై.. టెర్రరిస్టుల వరుస కాల్పులు

కాశ్మీర్‌లో వలస కార్మికులపై.. టెర్రరిస్టుల వరుస కాల్పులు

సెంట్రల్ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లా మగామ్ ప్రాంతంలో శుక్రవారం ఇద్దరు వలస కూలీలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరికీ గాయాలు అయ్యాయి.  సెప్టెంబర్ లో టెర్రరిస్టుల కాల్పుల కారణంగా ఇద్దరు వలస కార్మికులు మృతి చెందారు. గత 15 రోజుల్లో వలస కార్మికులపై జరిగిన రెండో కాల్పులు ఇవి. గాయాలపాలైన వారిని చికిత్స కోసం శ్రీనగర్‌లోని జెవిసి ఆసుపత్రి బెమీనాలో చేర్చారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని భద్రతా బలగాలు తెలిపాయి. సోఫియాన్, ఉస్మాన్ అనే ఇద్దరు కూలీలు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు.  ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.

సహరాన్‌పూర్‌కు చెందిన 25 ఏళ్ల సోఫియాన్, 20 ఏళ్ల ఉస్మాన్ మాలిక్‌ లు జలశక్తి శాఖలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్‌లో గందర్‌బల్ జిల్లాలోని సోనామార్గ్ ప్రాంతంలోని నిర్మాణ స్థలంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఓ డాక్టర్, ఆరుగురు వలస కార్మికులు మరణించారు. ఇది జరిగి కేవలం12 రోజులు మాత్రమే అవుతుంది. అంతకు ముందు అక్టోబర్ 18న కూడా బీహార్ కు చెందిన వలస కార్మికుడిని ఉగ్రవాదులు హతమార్చారు. ఇలా వరుసగా తీవ్రవాదులు వలస కార్మికులను టార్గెట్ చేసి చంపుతున్నారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల నిర్మాణాలకు అటంకాలు కలిగించాలనే ఉద్దేశ్యంతోనే జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు కార్మికులపై కాల్పులు చేస్తున్నారు.