కొండగట్టులో కళ తప్పిన గర్భగుడి

  • ఆర్నెళ్ల కింద చోరీకి గురైన వెండి తాపడాలు
  • మూడు నెలల కింద 15 కిలోల వెండి రికవరీ
  • కొత్త తాపడాలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం
  • ఆలయ అధికారుల తీరుపై భక్తులు అసహనం

కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లాలో  ప్రసిద్ధి చెందిన కొండగట్టు అంజన్న ఆలయం క్రమంగా కళ తప్పుతోంది. ఆరు నెలల కింద దొంగలు పడినప్పటి నుంచి అంతరాలయం కళా విహీనంగా మారింది. గుడిలోని వెండి తాపడాలు, కొన్ని వెండి వస్తువులు చోరీ కాగా, పోలీసులు సగం రికవరీ చేశారు. కొత్తగా వెండి తాపడాలు తయారు చేయించి ఏర్పాటు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గర్భగుడి ముఖ ద్వారం వద్ద ప్లై వుడ్ దర్శనమిస్తుండడంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల ఆదాయం ఉన్న గుడిని ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. ఆలయ లాకర్లలో క్వింటాళ్ల కొద్ది వెండి నిల్వలు ఉన్నా తాపడాలు ఎందుకు చేయించడం లేదని ప్రశ్నిస్తున్నారు. చేయించేందుకు ఎంతో మంది దాతలు సిద్ధంగా ఉన్నా అధికారులు నిద్ర మత్తు వీడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చోరీకి ముందు వరకు నిత్యం బంగారు, వెండి వస్తువులతో కాంతులీనే అంతరాలయం ప్రస్తుతం కళావిహీనంగా మారిందని, తక్షణమే గోడలకు వెండి తాపడాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఎనిమిది మంది దొంగలు అంజన్న గుడిలో చొరబడి సుమారు 33 కిలోల వరకు వెండి వస్తువులు, తాపడాలను ఎత్తుకెళ్లారు. కేసును చాలెంజింగ్​గా తీసుకున్న పోలీసులు మే నెలలో ఏడుగురిని అరెస్ట్​చేసి 15 కిలోల వరకు వెండిని రికవరీ చేశారు. ఇటీవల మరొకరిని అరెస్ట్​చేశారు. 

అధికారులు నిర్లక్ష్యం వీడాలి

గుట్టపైన ఏండ్లుగా పాతుకుపోయిన అధికారులు ఆలయ అభివృద్ధిని గాలికొదిలేశారు. చోరీకి గురైన వెండి వస్తువుల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తక్షణమే వెండి వస్తువులతో ఆలయాన్ని అలంకరించాలి. 
- ముత్యం శంకర్, భక్తుడు

అనుమతి రాగానే ఏర్పాటు చేస్తాం

ఆలయంలో కొత్తగా ఏర్పాటు చేయాల్సిన వెండి వస్తువుల గురించి ఉన్నతాధికారులకు నివేదించాం. అనుమతి రాగానే వెండి తాపడాలు ఏర్పాటు చేస్తాం. ఆలయాన్ని అందంగా అలంకరిస్తాం.
- వెంకటేశ్,  కొండగట్టు ఆలయ ఈఓ