నందిపేట మండలంలో తాళాలు పగులగొట్టి చోరీలు

నందిపేట మండలంలో తాళాలు పగులగొట్టి చోరీలు

నందిపేట, వెలుగు: గుర్తు తెలియని వ్యక్తులు ఐదు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. సోమవారం ఎస్ఐ చిరంజీవి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నందిపేట మండల కేంద్రంలోని రాంనగర్​ కాలనీలో జుధాచర్చి పక్కన ఉన్న ఇంటిలో ఇసుక కొండయ్య నివాసం ఉంటున్నాడు. అతడి ఇంటి పక్కనే కుమారుడు మహేశ్ ఇల్లు ఉంది.  ఆ ఇంటికి తాళం వేసి జిల్లా కేంద్రంలో  అద్దె ఇంటిలో ఉంటున్నాడు.

 అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఇద్దరు దొంగలు ఇంటిలోకి చొరబడి బీరువాను పగులగొట్టి మూడున్నర తులాల బంగారం, రూ.7 వేల నగదు ఎత్తుకెళ్లారు.  చోరీ ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.  అదే సమయంలో మరో దొంగల ముఠా  వీఆర్వో రాజేశ్వర్, పెదూరి భూమేశ్వర్​ఇంట్లోకి చొరబడి బీరువాలను పగులగొట్టారు.  ఏమీ దొరక్కపోవడంతో  వస్తువులను చిందరవందరగా పడేసి వెళ్లారు.  

అక్కడ నుంచి మేక వెంకటేశ్,  బైండ్ల నారాయణ ఇళ్లల్లోకి చొరబడ్డారు. అక్కడ కూడా ఏమీ దొరక్కపోవడంతో వెళ్లిపోయారు.  రెండు ముఠాలు దొంగతనాలకు పాల్పడినట్లు సీసీ పుటేజీలో రికార్డయ్యాయి. విషయం తెలిసిన క్లూస్​ టీం గ్రామానికి చేరుకుని వేలి ముద్రలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

రెండు  రోజుల క్రితమే రెక్కీ..?

రెండు రోజుల క్రితం కాలనీలో ముగ్గురు వ్యక్తులు రెక్కీ నిర్వహించినట్లు కాలనీవాసులు తెలిపారు. కాలనీలో రెండు బైక్​లపై ఓ యువతి, ఇద్దరు వ్యక్తులు 
 వచ్చి ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సర్వే చేస్తున్నామన్నారు.  ఆధార్​కార్డు జిరాక్స్ అడిగి అవి తీసుకోకుండానే వెళ్లిపోయారని చెప్పారు.  సర్వే పేరుతో కాలనీలో తిరిగి తాళాలు వేసిన ఇళ్లు గుర్తించి చోరీకి పాల్పడి ఉంటారని కాలనీవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళలో కాలనీలో పెట్రోలింగ్​ నిర్వహించాలని కోరుతున్నారు.

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్​ మున్సిపల్ పరిధిలోని కొటార్మూర్​లో తాళం వేసిన ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది.  స్థానికుల వివరాల ప్రకారం సుజాత, రమేశ్​దంపతులు ఇంటికి తాళం వేసి ఐదు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లి తిరిగి ఆదివారం వచ్చారు. ఇంటి తాళం పగులగొట్టి  ఇంట్లో ఉన్న నాలుగు తులాల బంగారం, ఐదు తులాల వెండి కడియాలు దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. చోరీ చేసిన దొంగలు ఇంట్లో ఉన్న పసుపు, కారం పూర్తిగా చల్లి తమ వేలిముద్రలు పడకుండా జాగ్రత్త పడినట్లు తెలిసింది. చోరీ విషయమై బాధితలు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. విలువైన డాక్యుమెంట్స్​ ఏమీ పోనందున కేసు అవసరం లేదని పోలీసులకు మౌఖికంగా చెప్పినట్లు తెలిసింది.  


బాల్కొండ, వెలుగు: బాల్కొండ మండల కేంద్రంలోని వినాయక్ నగర్ లో తాళం వేసిన ఇంట్లో ఆదివారం చోరీ జరిగింది. పొగరు చిన్న మల్లేష్ భార్య సవిత ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లింది.  గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని రెండు తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు ఎత్తుకెళ్లారు.  బాధితురాలు సరిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.