
- ఇంటికి తాళం వేస్తే లూటీ చేసేస్తున్న దొంగలు
- నిరుడు 948.. గడిచిన రెండు నెలల్లోనే 80 కి పైగా కేసులు
- శివారు కాలనీల ప్రజలకు కంటి మీద కునుకు కరువు
- చోరీలకు చెక్ పెట్టలేకపోతున్న వరంగల్ పోలీసులు
హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరాన్ని దొంగల బెడద వీడటం లేదు. సిటీ పరిధిలో కొంతకాలంగా వరుస దొంగతనాలు దడ పుట్టిస్తుండగా.. జనాలు ఇండ్లకు తాళం వేసి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. గతేడాది నుంచి నగరంలో ఇదే పరిస్థితి కొనసాగుతుండగా, తాజాగా బుధవారం హనుమకొండ గోపాలపూర్ లో దొంగలు గంట వ్యవధిలోనే నాలుగు ఇండ్లను కొల్లగొట్టడం హాట్ టాపిక్ గా మారింది.
శివారు కాలనీల ప్రజలు దొంగల భయంతో కంటి మీద కునుకు లేకుండా గడుపుతుండగా.. నగరంలో చోరీలకు చెక్ పెట్టేందుకు రాత్రిళ్లు గస్తీ పెంచాల్సిన పోలీస్ ఆఫీసర్లు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొద్దిరోజులుగా అంతర్రాష్ట్ర ముఠాలు నగరంలో తిష్ట వేసి చోరీలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుండగా.. నిందితులను గుర్తించి, పట్టుకోవడంలో ఖాకీలు విఫలమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పెరిగిపోతున్న దొంగతనాలు
వరంగల్ కమిషనరేట్పరిధిలో ఏటికేడు దొంగతనాలు పెరిగిపోతున్నాయి. 2023లో 927 చోరీలు జరగగా మొత్తంగా రూ.9.9 కోట్ల నష్టం వాటిల్లింది. ఇక నిరుడు దొంగతనాల సంఖ్య 948కి చేరింది. అందులో రాయపర్తి బ్యాంక్ చోరీ కేసు ప్రధానమైంది కాగా.. గత సంవత్సరం ఓవరాల్ గా రూ.24.6 కోట్ల వరకు ప్రాపర్టీ లాస్ జరిగింది. ఈ ఏడాది గడిచిన రెండు నెలల్లోనే 80కి పైగా దొంగతనాలు జరగగా.. రూ.50 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు పోలీసులు చెబుతున్నారు. కమిషనరేట్‌లో ఇలా ఏటికేడు దొంగతనాలు పెరిగిపోతుండటం కంగారు పుట్టిస్తుండగా, ప్రాపర్టీ రికవరీ 30 శాతం లేకపోవడం కలవరానికి గురి చేస్తోంది.
శివారు కాలనీల్లో భయం
వరంగల్ ట్రైసిటీ పరిధిలో హనుమకొండ, కేయూ, హసన్ పర్తి, సుబేదారి, కాజీపేట, మడికొండ, ఏనుమాముల, ఇంతేజార్ గంజ్, మిల్స్ కాలనీ, మట్వాడా స్టేషన్లు ఉండగా.. వీటికి తోడు సీసీఎస్, టాస్క్ ఫోర్స్ విభాగాలు పని చేస్తున్నాయి. గ్రేటర్ సిటీ పరిధిలో దాదాపు వెయ్యి వరకు శివారు కాలనీలుండగా.. పోలీసుల నిఘా ఆయా ప్రాంతాలపై సరిగా ఉండటం లేదనే విమర్శలున్నాయి. ప్రధానంగా కేయూ, హసన్ పర్తి, సుబేదారి, మిల్స్ కాలనీ పరిధిలో చోరీలు ఎక్కువగా జరుగుతుండగా.. మిగతా స్టేషన్ల పరిధిలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
ఇటీవల జరిగిన వరుస చోరీలు
- హనుమకొండ డాక్టర్స్ కాలనీకి చెందిన దంపతులిద్దరూ ఉద్యోగరీత్యా ఈ నెల 11న ఇంటికి తాళం వేసి విధులకు వెళ్లారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో వచ్చి చూసేసరికి ఇళ్లంతా చిందరవందరగా ఉంది. పట్టపగలే గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడగా.. దాదాపు 11 తులాల బంగారం, 30 తులాల వెండి, 2 లక్షల నగదు వరకు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- వరంగల్ ఉర్సు సుభాశ్ నగర్ కు చెందిన ఓ రిటైర్డ్ ఎంప్లాయ్ ఫిబ్రవరి 20న తన ఇంటికి తాళం వేసి ఆస్ట్రేలియాలో ఉన్న ఆయన కొడుకుల వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో మార్చి 7 అర్ధరాత్రి ఆ ఇంట్లో దొంగలు పడ్డారు. మూడు బీరువాలు పగులగొట్టి ఐదు తులాల బంగారం, రూ.2.5 లక్షల నగదు చోరీ చేయగా.. ఈ నెల 8న బాధితుడి బంధువులు మిల్స్ కాలనీ పోలీసులకు కంప్లైంట్ చేశారు.
- వరంగల్ పుప్పాలగుట్ట ఏరియాకు చెందిన ఓ వ్యక్తి ఇంటికి తాళం వేసి మహారాష్ట్రకు వెళ్లగా.. 24వ తేదీన ఆ ఇంట్లో దొంగలు పడ్డారు. రూ.లక్షన్నర విలువ చేసే బంగారం, ల్యాప్ టాప్స్, ఇతర విలువైన వస్తువులు ఎత్తుకెళ్లగా.. ఫిబ్రవరి 26న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
- దేశాయిపేట కల్యాణినగర్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తన తండ్రికి ఆరోగ్యం బాలేకపోవడంతో ఈ నెల 8న ఇంటికి తాళం పెట్టి హైదరాబాద్ లోని ఓ హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. ఈ నెల 10న తిరిగి రాగా.. ఇంటి తాళం పగులగొట్టి ఉంది. దాదాపు కిలోన్నర వెండి సామగ్రి చోరీకి గురైంది. దీంతో బాధితులు ఇంతేజార్ గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
- హనుమకొండ హంటర్ రోడ్డు సమీపంలోని దీనదయాళ్ నగర్ కు చెందిన సాంబయ్య దంపతులు ఈ నెల 8న ఇంటికి తాళం వేసి భువనగిరి వెళ్లారు. 10వ తేదీన తిరిగి ఇంటికి రాగా.. అప్పటికే ఇంటి తాళం పగులగొట్టి ఉంది. గుర్తు తెలియని దుండగులు తులం బంగారం ఎత్తుకెళ్లారు. అదేరోజు ఆయన ఇంటి పక్కనే ఉన్న అశోక్ ఇంట్లో 70 తులాల వెండి ఆభరణాలు అపహరణకు గురయ్యాయి.
- హనుమకొండ లోటస్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి ఈ నెల 7న పెళ్లికి వెళ్లి 11న ఇంటికి వచ్చాడు. అప్పటికే ఆ ఇంట్లో చోరీ జరిగి దాదాపు 3 తులాల బంగారం చోరీకి గురైంది. దీంతో ఈ నెల 11న సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.