నిర్లక్ష్యం నీడలో చదువు..! పెచ్చులూడుతున్న గోడలు.. పట్టించుకోని ఆఫీసర్లు

 

  •      పెచ్చులూడుతున్న గోడలు
  •     అపరిశుభ్ర ఆవరణలతో విషపురుగుల భయం
  •     ప్రమాదాల బారిన పడుతున్న స్టూడెంట్స్​
  •     పట్టించుకోని ఆఫీసర్లు

ఇక్కడ కనిపిస్తున్న పెద్ద గుంత గాంధారి మండలం బీర్మల్​తండా ప్రైమరీ స్కూల్​ఆవరణలో ఉంది. 1 నుంచి 5 తరగతి వరకు ఇక్కడ 48 మంది స్టూడెంట్స్​ ఉన్నారు. వాటర్​ పైపులైన్ ​కోసం 3 నెలల కింద పంచాయతీ వాళ్లు ఈ గుంత తవ్వారు. నెలలు గడుస్తున్నా, వర్క్స్​కంప్లీట్​ చేయలేదు. స్కూల్ ఆవరణలో ప్రమాదకరంగా ఉన్న ఈ గుంత చెంతనే స్టూడెంట్స్​ తిరుగుతుంటారు. ఏ మాత్రం అదుపుతప్పినా,  ప్రమాదం జరిగే అవకాశముంది. కానీ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు.

కామారెడ్డి, వెలుగు : జిల్లాలోని గవర్నమెంట్​ స్కూళ్లు, హాస్టళ్లలో జరుగుతున్న వరుస ప్రమాదాలు కలవరానికి గురిచేస్తున్నాయి. స్కూళ్లలో  పెచ్చులూడిన గోడలు, అపరిశుభ్ర పరిసరాలతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్టూడెంట్స్​భయంభయంగా గడుపుతున్నారు. మన ఊరు మన బడి ద్వారా వసతులు కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ నెల 5న మద్నూర్ ​మండలం ధన్నూర్​లో ప్రైమరీ స్కూల్​లో వర్షానికి పిట్టగోడ కూలి అంగన్​వాడీ సెంటర్​కు వచ్చిన 4 ఏండ్ల బాలుడు దినేశ్​కు తీవ్ర గాయాలయ్యాయి.

 రెండు కాళ్లు విరిగి,  ప్రస్తుతం హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​పొందుతున్నాడు.  ఈ నెల 6న మాచారెడ్డి మండలం కేంద్రంలోని మినీ రెసిడెన్షియల్​ స్కూల్​లో 5వ క్లాస్ ​చదువుతున్న నిఖిత అనే స్టూడెంట్​ను పాము కరిచింది. స్కూల్​సిబ్బంది వెంటనే స్పందించి, హాస్పిటల్ కు పంపడంతో ప్రాణాపాయం తప్పింది.  నీరుడు సెప్టెంబరు 10న బీర్కూర్​ మండల కేంద్రంలోని బీసీ హాస్టల్​లో పాముకాటుతో 5వ తరగతి విద్యార్థి సాయిరాజ్​(10) చనిపోయాడు. ఇలాంటి ఘటనలు రిపీట్​అవుతున్నా..అధికారులు నిర్లక్ష్యంగా  వ్యవహరిస్తున్నారని పేరెంట్స్​ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో 696 ప్రైమరీ స్కూల్స్, 126 యూపీఎస్,​ 183 హైస్కూల్స్, 19 కస్తూర్బాలు, 34 రెసిడెన్షియల్ ​స్కూల్స్​ఉన్నాయి.  వీటిలో లక్షా 58 వేల స్టూడెంట్స్​చదువుకుంటున్నారు. ఎస్సీ వెల్ఫేర్ ​హాస్టల్స్​31, బీసీ 26, ఎస్టీ 7 ​హస్టల్స్​ ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా స్కూల్స్​లో 450 వరకు క్లాస్​రూమ్స్​  శిథిలమయ్యాయి. చాలా చోట్ల టాయిలెట్స్​ గోడలకు పగుళ్లు వచ్చాయి. క్లాస్​రూమ్స్, టాయిలెట్స్​ గోడలు పెచ్చులూడుతున్నాయి. స్కూళ్ల​ఆవరణను ఎప్పటికప్పడు క్లీన్ ​చేయించకపోవడంతో పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయి. వాటి మధ్యనే స్టూడెంట్స్ ​తిరుగుతున్నారు. 

పెచ్చులూడి, గోడలు పడిపోయి స్టూడెంట్స్​కు గాయాలవుతున్నాయి. స్కూల్స్, హాస్టల్స్​లో విద్యార్థులు పాముల  కాటుకు గురవుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత ఆఫీసర్లు చోద్యం చూస్తున్నారే తప్పా, స్కూళ్లు, హాస్టల్స్​ఏరియాలను క్లీనింగ్, గోడల రిపేర్ ​చేయించడంపై శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వానాకాలం అయినందున మరిన్ని ప్రమాదాలు జరిగే ఛాన్స్​ ఉందని, జిల్లా ఉన్నతాధికారులు చొరవచూపి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఇది మాచారెడ్డి మండల కేంద్రంలోని మినీ రెసిడెన్షియల్​ ట్రైబల్ ​స్కూల్. 1 నుంచి 5వ తరగతి వరకు 150 మంది స్టూడెంట్స్​చదువుకుంటున్నారు. 
రెసిడెన్షియల్ ఊరు చివర ఉంది. స్కూల్​ముందు అపరిశుభ్రత నెలకొంది. పిచ్చిమొక్కలు గుబురుగా పెరగడంతో విష పురుగులు సంచరిస్తున్నాయి. ఊరి నుంచి స్కూల్​వరకు స్ర్టీట్ ​లైట్స్ ​కూడా లేవు. ఈ నెల 5న నిఖిత అనే స్టూడెంట్​ను పాము కరిచింది. రెసిడెన్షియల్ ​సిబ్బంది వెంటనే హాస్పిటల్​తరలించడంతో, ప్రాణాపాయం తప్పింది.