కౌంట్ డౌన్ నంబర్ 9: కాంగ్రెస్లో చేరిన అరికపూడి గాంధీ

  • హాట్ టాపిక్ గా బీఆర్ఎస్ ఎల్పీ విలీనం   
  • ఒక్కొక్కరుగా చేరుతున్న ఎమ్మెల్యేలు
  • పంద్రాగస్టు నాటికి ఆపరేషన్ పూర్తి?
  • అదే బాటలో ఎమ్మెల్సీలు కూడా..!

హైదరాబాద్: కారు ఖాళీ అవుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా హస్తం గూటికి చేరుతున్నారు. అధినేత బుజ్జగించినా.. ఫాం హౌస్ కు పిలుపించుకొని మాట్లాడినా ఫాయిదా ఉండటం లేదు. శనివారం (జూలై13) శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. నిన్న రాత్రి రాజేంద్రనగర్ శాసన సభ్యుడు ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. 

ఇదిలా ఉండగా గ్రేటర్ పరిధిలోని మాధవరంగ కృష్ణారావు (కూకట్ పల్లి), కేపీ వివేకానంద( కుత్బుల్లాపూర్), మర్రి రాజశేఖర్ రెడ్డి(మల్కాజ్ గిరి), సుధీర్ రెడ్డి (ఎల్బీనగర్), బండారు లక్ష్మారెడ్డి (ఉప్పల్), గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్ చెరు) కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. వీరితోపాటు జహీరాబాద్, దుబ్బాక ఎమ్మెల్యేలు కొనింటి మాణిక్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా హస్తం గూటికి చేరుతారని తెలుస్తోంది. అరికపూడి గాంధీతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య తొమ్మిదికి చేరింది. 

ఈ ఎనిమిది మంది కూడా చేరితే కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 17కు చేరుతుంది. ఇదిలా ఉండగా వీళ్లంతా ఈ వారం రోజుల్లోపే పార్టీ మారుతారని తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి మొత్తం 26 మంది ఎమ్మెల్యేల బలం అవసరం ఉంటుంది. ఆరుగురు మినహా అంతా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. పంద్రాగస్టులోపు  ఆపరేషన్  పూర్తి చేసి బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకొనే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని సమాచారం. 

లీగల్ గా ఆటంకాలు రాకుండా విమర్శలకు తావు లేకుండా పకడ్బందీ కాంగ్రెస్ అగ్రనేతలు చర్యలు తీసుకుంటున్నారని సమాచారం. 

కాంగ్రెస్ బలం 

గెలిచినవి        64

సీపీఐ        01
చేరికలు        09
మొత్తం బలం    75

బీఆర్ఎస్
గెలిచినవి        39
బైపోల్ లాస్    01
కోల్పోయిన ఎమ్మెల్యేలు    09
బలం        29