
- రవాణలో జాప్యం కారణంగా ప్రజలకు తిప్పలు
- షాపులకు వెళ్లివస్తున్న జనాలు
- ఎంఎల్ఎల్ స్టేజీ–2 పాయిట్స్కు చేరని రైస్
మహబూబాబాద్, వెలుగు: గ్రామాలు, పట్టణ ప్రాంత పేద, మధ్యతరగతి ప్రజలకు రేషన్‌షాపుల ద్వారా అందించే బియ్యం పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రతీ నెల ఒకటో తేదీ నుంచే రేషన్ బియ్యం షాపుల ద్వారా పంపిణీ చేస్తారు. సాంకేతిక లోపాల వల్ల ఈనెల10వ తేదీ నుంచి రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. అయినా ఇప్పటి వరకు రేషన్‌షాపులకు బియ్యం చేరనేలేదు. దీంతో రోజూ షాపులకు వెళ్లి బియ్యం రాక తిరిగి వస్తున్నారు.
రేషన్తరలింపులో తీవ్ర జాప్యం
ప్రతీ నెల ఎంఎల్ఎస్ స్టేజ్–1 పాయంట్ నుంచి ఎంఎల్ఎస్ స్టేజ్–2 పాయంట్స్కు బియ్యం చేర్చి, అక్కడి నుంచి లారీలు, ట్రాక్టర్లు ఇతర వాహనాల్లో రేషన్ షాపులకు సరుకులను తరలిస్తారు. మహబూబాబాద్ జిల్లాకు రేషన్ బియ్యాన్ని ఖమ్మం, ములుగు జిల్లాల్లోని గోదాంల నుంచి ఈనెల కేటాయింపులు చేసినా ఇప్పటికీ బియ్యం కూడా 30 నుంచి 40 శాతం వరకు కూడా చేరుకోలేదు. ఉమ్మడి వరంగల్జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని, బియ్యం సరఫరాలో సమస్యలు ఉన్నట్లు రేషన్ డీలర్లు పేర్కొన్నారు. రేషన్‌డీలర్ల వద్ద అందుబాటులో ఉన్న కొద్ది మొత్తం బియ్యాన్ని అందరికీ పంపిణీ చేయలేకపోతున్నామని వారు చెబుతున్నారు. మహబూబాబాద్జిల్లాలో 551 రేషన్ షాపుల్లోనూ ఇప్పటికీ ఇదే సమస్య నెలకొని ఉంది. ఎంత తొందరగా బియ్యాన్ని పంపిణీ చేస్తే అంత మంచిదని జనాలు కోరుతున్నారు.
షాపుల చుట్టూ తిరగలేకపోతున్నం..
రేషన్‌బియ్యం కోసం షాపుల చుట్టూ తిరగలేకపోతున్నం. షాపు వద్దకు ఎప్పుడు పోయినా ఇంకా బియ్యం రాలేదంటున్నరు. ఇంతకు ముందు ఒకటో తారీఖు నుంచే ఇస్తుండే. ఇప్పడు ఎందుకు లేటౌవుతుందని డీలర్లను అడిగితే పైనే సమస్య ఉందంటున్నారు. రేషన్ బియ్యం
అందించేలా చూడాలె.
బొంత ఉమా, హరిపిరాల గ్రామం, తొర్రూరు మండలం
సరఫరా చేసేలా చూస్తాం...
మహబూబాబాద్ జిల్లాకు ఈనెల రేషన్ కోటాను ఖమ్మం, ములుగు జిల్లాల నుంచి కేటాయించారు. రవాణాలో ఆలస్యం జరిగిన మాట వాస్తవమే. స్టేజీ–1 ఎంఎల్ఎస్ పాయంట్ల నుంచి స్టేజీ–2 ఎంఎల్ఎస్ పాయంట్లకు రేషన్ పంపేలా ఏర్పాట్లు చూస్తున్నాం. అక్కడి నుంచి రేషన్‌షాపులకు బియ్యం చేరుతాయి. పంపిణీ గడువును అవసరాన్ని బట్టి ఈనెల చివరి వరకు పొడగిస్తాం. ప్రజలు ఆందోళన చెందవద్దు.
నర్సింగ్‌రావు, డీఎస్ వో, మహబూబాబాద్ జిల్లా