గ్రేటర్ వ్యాప్తంగా తీవ్రమైన దోమల సమస్య

గ్రేటర్ వ్యాప్తంగా తీవ్రమైన దోమల సమస్య
  • వారానికి ఒకసారి కూడా ఫాగింగ్​ చేయట్లే!
  • గ్రేటర్ వ్యాప్తంగా తీవ్రమైన దోమల సమస్య
  • సాయంత్రం 6 గంటల తర్వాత బయట తిరగలేని పరిస్థితి
  • వీఐపీల ప్రాంతాల్లో మాత్రమే రెగ్యులర్​గా ఫాగింగ్​
  • మిగిలిన చోట్ల నామ్ కే వాస్తేగా చర్యలు 
  • చాలా ఏరియాల్లో నెలకు 2 – 3 సార్లు కూడా చేయట్లేదనే ఆరోపణలు


హైదరాబాద్, వెలుగు:  జీహెచ్ఎంసీ పరిధిలో దోమల నివారణకు రెగ్యులర్​గా ఫాగింగ్​చేయట్లేదు. వీఐపీలు ఉండే ప్రాంతాలకే ఫాగింగ్​పరిమితం అవుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం గ్రేటర్​వ్యాప్తంగా దోమలు విజృంభిస్తున్నాయి. సాయంత్రం 6 గంటల తర్వాత బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల రోడ్లపై నడుచుకుంటూ వెళ్తుంటే నోరు, ముక్కు, చెవుల్లోకి వెళ్తున్నాయి. దోమల నుంచి తప్పించుకునేందుకు జనం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. డోర్లు, కిటికీలకు మస్కిటో నెట్లు పెట్టించుకోవడంతోపాటు, ఇంటి లోపల వివిధ రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో నెలకు మూడుసార్లు కూడా ఫాగింగ్ చేయడం లేదని, కంప్లయింట్ చేసినా పట్టించుకోవడం లేదని జనం మండిపడుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 30 సర్కిళ్లు ఉండగా,11 సర్కిళ్లలో దోమల తీవ్రత అధికంగా ఉంది. వేలాది హాట్​స్పాట్లు ఉన్నట్లు బల్దియా అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నప్పటికీ కొన్నిచోట్ల మినహా దోమల బెడద తగ్గలేదు.

రెండేళ్లలో రూ.42 కోట్లు ఖర్చు

దోమ‌‌‌‌ల నివార‌‌‌‌ణకు జీహెచ్ఎంసీ గడిచిన రెండేళ్లలో రూ.42 కోట్లు జీహెచ్ఎంసీ ఖర్చు చేసింది. అంటే సిటీలో ఒక్కో సిటీజన్ పై ఏడాదికి రెండు రూపాయల చొప్పున ఖర్చు చేస్తోంది. క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయిస్తున్నామని, రోగాలు వ్యాప్తి జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా.. గ్రౌండ్ లేవల్​లో పరిస్థితులు వేరేలా ఉన్నాయి. కోట్లు ఖర్చు చేస్తున్నా దోమ‌‌‌‌ల బెడ‌‌‌‌ద త‌‌‌‌గ్గడం లేదు.

ఎంటమాలజీ సిబ్బందికి ఇతర పనులు

జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగంలో 2,300 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరంతా డైలీ దోమల నివారణ కోసం ఫాగింగ్, యాంటి లార్వా ఆపరేషన్​లో పాల్గొనాలి. ఇందుకోసం డివిజన్ కి రెండు చిన్న మెషీన్లు, 45 లీటర్ల కెపాసిటీ ఉన్న పెద్ద మెషీన్లు రెండు ఉన్నాయి. వీటితో కనీసం వారానికి ఒకసారైనా ఫాగింగ్​చేయాలి. చెరువులు, కుంటలు, మూసీ పరివాహక ప్రాంతాల్లోవారానికి రెండు సార్లు చేయాల్సి ఉంది. 

ఒక్కో సిబ్బంది పరిధిలో100 నుంచి150 ఇండ్లు ఉన్నాయి. అయితే అధికారులు ఎంటమాలజీ సిబ్బందికి ఇతర పనులు అప్పగిస్తుండటంతో ఫాగింగ్, యాంటి లార్వా పనులు సక్రమంగా జరగడం లేదు. కనీసం ఏడాదిలో రెండు సార్లు యాంటీ లార్వా ఆపరేషన్ చేసేందుకు సమయం ఇవ్వడం లేదు. ట్యాక్స్ కలెక్షన్, ఎలక్షన్స్ బీఎల్ఓ డ్యూటీ, ఆధార్ – ఓటర్ ఐడీ లింక్, పట్ణణ ప్రగతి, బతుకమ్మ చీరల పంపిణీ ఇలా అన్ని కార్యక్రమాలకు ఎంటమాలజీ సిబ్బందిని వాడుతుండటంతో ఆ ప్రభావం దోమల నివారణ చర్యలపై పడుతోంది.