మానవ అక్రమ రవాణా అరికట్టాలి:సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్

మానవ అక్రమ రవాణా అరికట్టాలి:సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్

హైదరాబాద్, వెలుగు: మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ పిలుపునిచ్చారు. ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ, తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఎంసీఆర్ హెచ్​ఆర్డీలో రాష్ట్రస్థాయి శిక్షకులకు ట్రైనింగ్ కార్యక్రమాన్ని ప్రజ్వల సంస్థ ఫౌండర్ సునీత కృష్ణన్ తో కలిసి ఆమె ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మానవ అక్రమ రవాణా, లైంగిక వ్యాపారం జరుగుతున్న తీరు, బాధితురాలిపై  ఉండే ప్రభావాలు, సైబర్ ఆధారిత అక్రమరవాణా, చట్టాలు.. బీఎన్ఎస్, ఐటీపీఏ, పీసీఎంఏ, సఖి, భరోసా, చైల్డ్ లైన్, పోలీస్ టోల్ ఫ్రీ నంబర్స్ 1098, 100, 181, 1930, 181 పై అవగాహన కల్పించారు. అనంతరం దివ్య దేవరాజన్ మాట్లాడారు. మానవ అక్రమ రవాణాతో ఎంతో మంది అమ్మాయిల జీవితాలు నాశనం అవుతున్నాయన్నారు. సైబర్ ట్రాఫికింగ్ వేగంగా విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఫోన్​లు ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలపై పిల్లలకు తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని కోరారు. ఆర్థిక కారణాలు, అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు.. మాయమాటలు చెప్పి, ఉద్యోగం, సినిమా అవకాశాలు కల్పిస్తామని మరికొందరు యువతులను ట్రాప్ చేసి వ్యభిచార గృహాల్లో విక్రయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

పద్మశ్రీ అవార్డు గ్రహీత, సునీత కృష్ణన్  మాట్లాడుతూ, మానవ అక్రమ రవాణాను ఆదిలోనే అడ్డుకుంటే ఆడ పిల్లలను కాపాడుకోవచ్చన్నారు. ప్రజ్వల సంస్థ ద్వారా ఇప్పటివరకు 30 వేల మంది అమ్మాయిలు, మహిళలను కాపాడినట్లు చెప్పారు. ప్రోగ్రాములో సెర్ప్ డైరెక్టర్ హెచ్డీ సునీత, ప్రాజెక్ట్ మేనేజర్ సరిత, ఏపీఎం అరుంధతి, డీపీఎం సురేఖ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.