మంచిర్యాలలో రైతుల తిప్పలు : పత్తి అమ్ముకోవాలంటే ఆధార్ ఉండాల్సిందేనా.. సర్వర్లు ఎందుకు డౌన్ అవుతున్నాయి

మంచిర్యాలలో రైతుల తిప్పలు : పత్తి అమ్ముకోవాలంటే ఆధార్ ఉండాల్సిందేనా.. సర్వర్లు ఎందుకు డౌన్ అవుతున్నాయి
  • పత్తి అమ్మకాలకు ఆధార్ ​తిప్పలు
  • సర్వర్​ డౌన్​తో నాలుగు రోజులుగా నిలిచిన కొనుగోళ్లు
  • అవగాహన లేక ఆందోళనలకు దిగుతున్న రైతులు 
  • తరచూ బంద్​లతో దళారులకు అమ్మకుంటున్న వైనం

మంచిర్యాల, వెలుగు:  పత్తి అమ్మకాలకు ఆధార్​అడ్డంకిగా మారింది. సర్వర్​ డౌన్​ కావడంతో నాలుగు రోజులుగా కాటన్ ​కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ విషయం తెలియక రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. వ్యవసాయ మార్కెట్లు, జిన్నింగ్​మిల్లులు వద్ద తిండి తిప్పలు లేకుండా పడిగాపులు కాస్తున్నారు. వెహికల్స్​కు వెయిటింగ్​చార్జీలు తడిసిమోపెడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు సీసీఐ, మార్కెటింగ్​ అధికారులు వివిధ కారణాలతతో తరచూ సెంటర్లను బంద్​ చేయడంతో గత్యంతరం లేక దళారులకు అమ్ముకుంటున్నారు. 

సర్వర్​ డౌన్.. కొనుగోళ్లకు బ్రేక్ 

కేంద్ర ప్రభుత్వం సీసీఐ ద్వారా మద్దతు ధరకు పత్తి కొనుగోళ్లు చేపట్టింది. ఇందుకోసం వ్యవసాయ మార్కెట్లు, జిన్నింగ్​ మిల్లుల్లో ప్రత్యేకంగా సెంటర్లను ఏర్పాటు​చేసింది. కొనుగోళ్లలో అవకతవకలను అరికట్టేందుకు ఆధార్ ​కార్డును లింక్​ చేసింది. రైతులు ఎన్ని ఎకరాల్లో పత్తి వేశారు? ఎన్ని క్వింటాళ్ల దిగుబడి వచ్చింది? అనే వివరాలను ఏఈవోలు ధ్రువీకరించాల్సి ఉంటుంది. అనంతరం పట్టాదారు పాస్​బుక్, బ్యాంక్​ అకౌంట్, ఆధార్​ కార్డు తీసుకొని సీసీఐ సెంటర్​కు వెళ్లాలి. అక్కడ వాటిని పరిశీలించి అన్నీ సరిగా ఉన్నాయా, లేదా అని నిర్ధారించుకుం టారు. ఆధార్​నంబర్​ ఎంటర్ చేయగానే దానికి లింక్​చేసుకున్న ఫోన్ ​నంబర్​కు ఓటీపీ వస్తుంది. ఆన్​లైన్​ప్రాసెస్​ పూర్తికాగానే పత్తిని కాంటా వేస్తారు. కానీ ఈ నెల 10 నుంచి ఆధార్ సర్వర్​ డౌన్ ​కావడంతో ఆధార్ అథెంటికేషన్​ కావడం లేదు. ఈ కారణంగా నాలుగు రోజులుగా సీసీఐ సెంటర్లలో కొనుగోళ్లు నిలిచిపోయాయి. 

తిప్పలు పడుతున్న రైతులు

ఆధార్​ సర్వర్​ డౌన్ ​కావడంతోనే కొనుగోళ్లు నిలిపివేసిన విషయంపై రైతులకు అవగాహన కల్పించడంలో సీసీఐ, మార్కెటింగ్​అధికారులు విఫలమయ్యారు. ఉన్నఫలంగా కొనుగోళ్లు ఆపివేయడంతో ఆగ్రహానికి గురైన రైతులు రోడ్లెక్కి ఆందోళనలకు దిగుతున్నారు. మొన్న మంచిర్యాల జిల్లా తాండూర్, చెన్నూర్, ఆసిఫాబాద్​ జిల్లా కేంద్రంతో పాటు చాలాచోట్ల ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. ఇదే అదునుగా అపోజిషన్​ లీడర్లు పత్తి కొనుగోళ్లలో సర్కారు నిర్లక్ష్యమంటూ రైతులను తప్పుదారి పట్టిస్తున్నారు. దీనికితోడు సీసీఐ, మార్కెటింగ్​ అధికారులు దళారులతో కుమ్మక్కై అక్రమాలకు తెరలేపడం, టోకెన్లు అమ్ముకోవడం, టెంపరరీ రిజిస్ట్రేషన్లలో అవకతవకలు, తదితర కారణాలతో రైతులు ఆగ్రహంతో ఉన్నారు.

Also Read :- వ్యాపారుల సిండికేట్.. పత్తి రైతుల విల విల

 అంతేగాకుండా జిన్నింగ్​ మిల్లుల్లో పత్తి నిల్వలు పేరుకుపోయాయని తరచూ సెలవులు ప్రకటిస్తుండడం, ఇలా ప్రతిదానికి కొనుగోళ్లు నిలిపివేయడం వల్ల రైతులు పత్తిని అమ్ముకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. తాజాగా ఈ నెల 10 నుంచి ఆధార్​సర్వర్​ డౌన్​ కావడంతో కొనుగోళ్లు చేపట్టక జిన్నింగ్​ మిల్లులు, మార్కెట్​యార్డుల ఎదుట రోడ్లపై ట్రాక్టర్లు, డీసీఎం వ్యాన్లు, ఇతర ట్రాలీ వెహికల్స్ కిలోమీటర్ల మేర బారులు తీరిన దృశ్యాలు అన్నదాతల వెతలకు అద్దం పడుతున్నాయి. 

అంతా పరేషాన్​ ఉన్నది

నేను ఆదివారం చెన్నూర్​మిల్లుకు పత్తి తీసుకొచ్చిన. సోమవారం కాంటా అయితదనుకున్న. కానీ ఆన్​లైన్​ పని చేస్తలేదని కాంటా బంద్​ పెట్టిన్రు. ఇప్పటికే నాలుగు రోజులైంది. తిండి తిప్పలు లేకుండా అవస్థలు పడుతున్నాం. ట్రాక్టర్​ కిరాయి రోజుకు రూ.3500. వెయిటింగ్​ చార్జి రూ.వెయ్యి తీసుకుంటున్రు. ఆన్​లైన్​ ఎప్పుడు వస్తదో, కాంటా ఎప్పుడైతదో, ఇంటికి ఎప్పుడు పోతమో.. అంతా పరేషాన్​ ఉన్నది. 
- తిరుపతి, పత్తి రైతు, నెన్నెల 

సర్వర్​ పునరుద్ధరణ  తర్వాతే కొనుగోళ్లు

ఈ నెల 10 నుంచి ఆధార్ ​సర్వర్​ పనిచేయడం లేదు. సర్వర్​ డౌన్​ కావడం, సాంకేతిక సమస్యలతో సీసీఐ సెంటర్లలో కాటన్ ​కొనుగోళ్లు నిలిపివేశాం. జిల్లాలోని చెన్నూర్, లక్సెట్టిపేట, బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ల పరిధిలోని సెంటర్లను నాలుగు రోజులుగా క్లోజ్​ చేశాం. ఆధార్​ సర్వర్​ పునరుద్ధరణ తర్వాత యథావిధిగా కొనుగోళ్లు చేపడుతాం. అప్పటివరకు రైతులు పత్తిని తీసుకురావద్దు. 
 ఎండీ షాబొద్దీన్, జిల్లా మార్కెటింగ్​ ఆఫీసర్, మంచిర్యాల