హోటళ్లు, రెస్టారెంట్లు.. సర్వీస్ చార్జీ వేయొద్దు: ఢిల్లీ హైకోర్టు

హోటళ్లు, రెస్టారెంట్లు.. సర్వీస్ చార్జీ వేయొద్దు: ఢిల్లీ హైకోర్టు
  • బలవంతంగా వసూలు చేయడం హక్కుల ఉల్లంఘనే
  • కస్టమర్లు స్వచ్ఛందంగా డబ్బులు ఇవ్వవచ్చని వెల్లడి  


న్యూఢిల్లీ: ఆహార బిల్లులపై సర్వీస్ చార్జీ చెల్లింపు స్వచ్ఛందమని.. హోటళ్లు, రెస్టారెంట్లు కస్టమర్లపై బలవంతంగా విధించొద్దని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఫుడ్ బిల్లులపై తప్పనిసరిగా సర్వీస్ చార్జీ విధించడాన్ని నిషేధించే సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) మార్గదర్శకాలను సవాలు చేస్తూ రెస్టారెంట్ సంస్థలు దాఖలు చేసిన రెండు పిటిషన్లను జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ శుక్రవారం తోసిపుచ్చారు. వివిధ రకాల చార్జీలు వసూలు చేయడం వినియోగదారుల హక్కులను ఉల్లంఘించడమే కాకుండా చట్ట విరుద్ధమని కోర్టు పేర్కొంది. 

ఆహార బిల్లులపై సర్వీస్ చార్జీని బలవంతంగా వసూలు చేయడం తప్పుదారి పట్టించే, మోసపూరిత, అన్యాయమైన వ్యాపార పద్ధతికి సమానమని అభిప్రాయపడింది. వినియోగదారుల హక్కులు రెస్టారెంట్ల హక్కుల కంటే ఎక్కువగా ఉంటాయని, సమాజ ప్రయోజనాలే ప్రధానమని కోర్టు నొక్కి చెప్పింది. 

సీసీపీఏ కేవలం సలహా సంస్థ మాత్రమే కాదని, అన్యాయమైన వాణిజ్య పద్ధతులను నివారించడానికి, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటానికి, మార్గదర్శకాలను జారీ చేయడానికి అధికారం కలిగి ఉందని కోర్టు పేర్కొంది. సీపీఏ 2019 కింద మార్గదర్శకాలను జారీ చేయడం సీసీపీఏ ముఖ్యమైన విధి అని, అన్ని రెస్టారెంట్లు దీనిని తప్పనిసరిగా పాటించాలని కోర్టు తీర్పులో వెల్లడించింది.