ఉమ్మడి కరీంనగర్​ జిల్లా సంక్షిప్త వార్తలు 

ఉమ్మడి కరీంనగర్​ జిల్లా సంక్షిప్త వార్తలు 

 

  • ప్రైవేట్ కు దీటుగా ప్రభుత్వ  వైద్య సేవలు
  • మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్‍ సిటీ, వెలుగు: ప్రైవేట్ ​హాస్పిటల్స్ కు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అందిస్తూ తల్లీబిడ్డల క్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం  పనిచేస్తోందని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో రోగులకు, బాలింతలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. పేషెంట్లకు అందిస్తున్న సేవలపై డాక్టర్లతో మాట్లాడారు. రజిని అనే మహిళకు ఒకే కాన్పులో ఒక  పాప, ఒక బాబు కవలలు జన్మించడంతో వారికి రెండు కేసీఆర్ కిట్లతో పాటు రూ.5000 వేలు అందించారు. అనంతరం నగరంలోని మీ సేవ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణి చేశారు. మొత్తం 135 మందికి రూ.48,84,000 విలువచేసే చెక్కులను అందించారు. అనంతరం నగరంలోని గిద్ద పెరుమాండ్ల స్వామి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలలో మంత్రి పాల్గొన్నారు.  ఆయా కార్యక్రమంలో కలెక్టర్ కర్ణన్, మేయర్ సునీల్ రావు, జడ్పీ చైర్​పర్సన్​విజయ తదితరులు పాల్గొన్నారు.

  • 106 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ పట్టివేత
  • 6 వాహనాలు సీజ్​, నిందితుల అరెస్టు

వేములవాడరూరల్, వెలుగు : అక్రమంగా పీడీఎస్ రైస్ తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను రాజన్న సిరిసిల్ల టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. పక్కా సమాచారం అందడంతో డీఎస్పీ రవి కుమార్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్సై ఎం.మారుతి, సిబ్బంది కలిసి వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామం వద్ద 6 వెహికల్స్​లో తరలిస్తున్న 106 క్వింటాళ్ల  రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను, వాహనాలను, రైస్ ను వేములవాడ రూరల్ పోలీసులకు అప్పగించారు. నిందితుల్లో రుద్రంగికి చెందిన నూనె గంగాధర్, నిజామాబాద్ గ్రామానికి చెందిన చిత్తరి రమేశ్, వేములవాడకు చెందిన వనరాషి ఆంజనేయులు, కోనాయపల్లికి చెందిన కదమంచి సంతోష్, సిద్దిపేటకు చెందిన గంధం శేఖర్, కోనరావుపేటకు చెందిన నూనె భూమయ్య ఉన్నారు.

వివాహ వేడుకల్లో వివేక్ వెంకటస్వామి

పెద్దపల్లి, వెలుగు: జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ లీడర్​సజ్జాద్ కూతురు వివాహ వేడుకలకు బీజేపీ నేషనల్​ ఎగ్జిక్యూటివ్ మెంబర్, మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి శుక్రవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎంబీ గార్డెన్​లో ఏర్పాటు చేసిన విందులో ఆయన పాల్గొన్నారు. అంతకు ముందు సుల్తానాబాద్ మండలం రెబ్బల్​దేవ్​పల్లికి చెందిన ఏబీవీపీ నాయకుడు అన్వేశ్​వివాహం సందర్భంగా వివేక్​ వధూవరులను ఆశీర్వదించారు. అలాగే అందుగులపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను దీవించారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు తదితరులు 
పాల్గొన్నారు. 

భూమి కబ్జా అయ్యిందని ఆత్మహత్యాయత్నం

పెద్దపల్లి, వెలుగు: తన భూమి కబ్జాకు గురైందని బచ్చు మురళి అనే వ్యక్తి పెద్దపల్లిలోని అంబేద్కర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. జిల్లాలోని అప్పన్నపేటకు చెందిన మురళి స్థానికంగా ఉన్న 706, 707 సర్వే నంబర్లలో రెండు గుంటల ప్లాట్​ను కొమురయ్య అనే వ్యక్తి నుంచి కొన్నాడు. అదే ప్లాట్ మరో ఇద్దరి పేరు మీద రిజిస్టర్ అయి ఉండటంతో మురళి, కొమురయ్యను నిలదీశాడు. ఫలితం లేకపోవడంతో మురళి కొడుకు శ్రీనివాస్ గురువారం పురుగుల మందు తాగాడు. ఈ క్రమంలోనే లక్షలు పెట్టి భూమి కొంటే తనకు న్యాయం జరుగటం లేదని మురళి శుక్రవారం మనస్థాపానికి గురై ఒంటిపై పెట్రోల్​ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో స్థానికులు అతడిని అడ్డుకున్నారు. వెంటనే బ్లూకోట్ పోలీసులు బాధితుడిని నీళ్లతో కడిగారు. అనంతరం కొమురయ్యను, మురళినీ పోలీసుస్టేషన్​కు తరలించారు.

ఎన్టీపీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల 

జ్యోతినగర్, వెలుగు: రామగుండం ఎన్టీపీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నోటిఫికేషన్ ను యాజమాన్యం శుక్రవారం విడుదల చేసింది. ఆగస్టు 30న కార్మిక సంఘాల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 2న నామినేషన్ల ఉపసంహరణ, 4న నామినేషన్లు పరిశీలించి గుర్తులు కేటాయిస్తారు. సెప్టెంబర్ 19న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగనున్నాయి. 305 మంది ఓటర్లు ఉన్నారు.

ఎస్సైపై చర్యలు తీసుకోవాలి
పోలీస్​ స్టేషన్​ ముందు బీజేపీ లీడర్ల ధర్నా

సిరిసిల్ల కలెక్టరేట్,వెలుగు : జిల్లాలోని ఇల్లంతకుంట మండలంలో బీజేపీ లీడర్లపై దాడి చేసిన ఎస్ఐ  మహేందర్ పై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించి మాట్లాడారు. ఇల్లంతకుంటలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం కోసం బీజేపీ శాంతియుతంగా నిరసన చేపట్టగా ఎస్ఐ దాడి చేశారని ఆరోపించారు. ఆస్పత్రి నిర్మాణానికి మినిస్టర్​కేటీఆర్ హామీ ఇచ్చి మూడేళ్లు నిండాయని, అయినా పట్టించుకోవడంలేదన్నారు. దీంతో సీఐ ఉపేందర్ నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు. ధర్నాలో లీడర్లు ఆర్. గోపి, రమాకాంత రావు, తిరుపతి రెడ్డి, కార్తిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తమ్ముడిపై అన్న గొడ్డలి దాడి భూ తగాదాలే కారణం

మెట్ పల్లి, వెలుగు : భూ తగాదాలతో  తమ్ముడిపై అన్న గొడ్డలితో దాడిచేసిన ఘటన మెట్ పల్లిలో జరిగింది.  ఎస్సై సుధాకర్ కథనం ప్రకారం.. పట్టణంలోని శివాజీ నగర్ కు చెందిన మొద్దు మార్గం గంగాధర్(60) కు పెద్ద నాన్న కొడుకైన మొద్దు మార్గం లింబయ్య(65) కు కొన్నేండ్లుగా భూమి విషయంలో తగాదాలున్నాయి. ఇరువురు కోర్టును ఆశ్రయించగా కోర్టు గంగాధర్ కు ఫేవర్ గా తీర్పు ఇచ్చింది. దీంతో ఆ భూమిలో పంట సాగు చేయడానికి వెళ్తే లింబయ్య, అతని కొడుకు గణేశ్​అడ్డుకునేవారు. దీంతో ఇరువురి మధ్య వాదోపవాదాలు జరిగాయి. శుక్రవారం ఉదయం శివాజీ నగర్ లో నివాసం ఉండే గంగాధర్ తల్లి చిన్నమ్మ ఇంటికి వెళ్లాడు. ఈక్రమంలో  లింబయ్య, గణేశ్ గొడ్డలితో గంగాధర్ మెడపై దాడి చేశారు. దీంతో గంగాధర్ తీవ్రంగా గాయపడగా జగిత్యాల హాస్పిటల్ కు తరలించారు. గంగాధర్ భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.


కనులపండువగా కృష్ణాష్టమి

ఉమ్మడి కరీంగనర్ ​జిల్లాలోని అన్ని మండలాల్లో కృష్ణాష్టమి వేడుకలు కనులపండువగా నిర్వహించారు. గోదావరిఖని విశ్వహిందూ పరిషత్‌‌‌‌‌‌‌‌, యాదవ సంఘం ఆధ్వర్యంలో, చొప్పదండిలోని వీణధారి, కృష్ణవేణి, ఝాన్సీ, గీత హై స్కూల్స్​లో జమ్మికుంట గీతా మందిర్​, సరస్వతి శిశుమందిర్​అయ్యప్ప స్వామి ఆలయాల్లో,  పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్​లో  వేడుకలు జరిపారు. అలాగే గన్నేరువరం విజ్ఞాన్ కాన్వెంట్ స్కూల్లో,  రామడుగు మండలం గోపాల్​రావుపేట అక్షర, రాంనగర్ ఆక్స్​ఫర్డ్,​ గంగాధర మండలం గర్శకుర్తి, గంగాధర, బూరుగుపల్లి ప్రభుత్వ స్కూళ్ల​లో, మెట్ పల్లి పట్టణంలో, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో, రేకుర్తి అల్ఫోర్స్ గురుకుల విద్యాలయంలో జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్టూడెంట్లు కృష్ణుడు, గోపికల వేషంతో అలరించారు. పలు ప్రాంతాల్లో ఆయా పార్టీల లీడర్లు ఉట్టి కొట్టి వేడుకలు జరుపుకున్నారు. - వెలుగు, నెట్ వర్క్​


చెట్ల పొదల్లో పసికందు లభ్యం

గంగాధర, వెలుగు: మండలంలోని లక్ష్మీదేవిపల్లి చెట్లపొదల్లో శుక్రవారం మగ పసికం దు మృతదేహం లభ్యమైంది. చెట్ల పొదల్లోంచి దుర్వాసన వస్తుండడంతో గ్రామస్తులు వెతకగా చేతుల్లేని మగశిశువు కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని కరీంనగర్ సివిల్​ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. కాగా శిశువు నాలుగు రోజుల క్రితం పుట్టి ఉంటాడని, చేతులు లేకుండా జన్మించి చనిపోయాడా లేదా చేతులు లేకపోవడంతో ఎవరైనా చంపి పడేశారా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు పేర్కొన్నారు.

గురుకులాలతో  నాణ్యమైన విద్య
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ 

జగిత్యాల రూరల్, వెలుగు: మైనారిటీ గురుకులాల ద్వారా పేద, మధ్య తరగతి ముస్లిం స్టూడెంట్లకు ప్రభుత్వం నాణ్యమైన విద్య అందిస్తోందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాలలోని ఇస్లాంపురలో కలెక్టర్ రవి నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణితో కలిసి ఆయన బస్తీ దవాఖానాను ప్రారంభించారు. అనంతరం వార్డుకు చెందిన ఇద్దరికి రూ.35 వేల సీఎం రిలీఫ్ ​ఫండ్ ​చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు బస్తీ దవాఖానాతో ఆరోగ్య సేవలు అందించడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీనివాస్, అడిషనల్ కలెక్టర్ అరుణ, ఆర్డీఓ మాధురి, డీఎంహెచ్​ఓ శ్రీధర్ పాల్గొన్నారు.

దివ్యాంగుల సంక్షేమానికి కృషి : కలెక్టర్ కర్ణన్​

కరీంనగర్ సిటీ, వెలుగు: వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని కరీంనగర్​కలెక్టర్ కర్ణన్​అన్నారు. శుక్రవారం నగరంలోని ఓల్డ్ ఏజ్ హోమ్ లో వృద్ధులకు, దివ్యాంగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ వయోవృద్ధులను వేధిస్తే హెల్ప్ లైన్ నంబర్ 14567 కు కాల్ చేయాలని, అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. దివ్యాంగుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 572 8980 కి కాల్ చేయాలన్నారు. ఆయన వెంట జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి, జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అధికారి శ్రీనివాసరావు, డీఎంహెచ్‍ఓ జవేరియా  పాల్గొన్నారు. 

తాళం వేసిన ఇంట్లో చోరీ

కోనరావుపేట, వెలుగు: మండలంలోని మల్కాపేటలో తాళం వేసిన ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. బాధితుడి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎదురుగట్ల నాగరాజు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి బుధవారం సిరిసిల్లలోని తన కొత్త ఇంట్లో గృహప్రవేశానికి వెళ్లాడు. శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చి చూసే సరికి తాళం పగుల గొట్టి ఇంట్లో వస్తువులన్నీ చిందర వందరగా పడి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. దొంగలు బీరువా తాళం ధ్వంసం చేసి మూడున్నర తులాల బంగారం ఎత్తుకెళ్లారు. పోలీస్ సిబ్బంది, క్లూస్ టీం  ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు.  

ఆక్వా హబ్ తో 10వేల మందికి ఉపాధి కలెక్టర్ అనురాగ్ జయంతి 

సిరిసిల్ల  కలెక్టరేట్, వెలుగు: శ్రీరాజరాజేశ్వర జలాశయం(మిడ్‌‌‌‌మానేరు) కేంద్రంగా ఏర్పాటు చేసే ఆక్వా హబ్‌‌‌‌ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 10వేల మందికి ఉపాధి లభిస్తుందని కలెక్టర్ అనురాగ్ జయంతి  అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హల్ లో అమెరికన్‌‌‌‌ సంస్థ ఫిష్‌‌‌‌ ఇన్‌‌‌‌, దేశీయ సంస్థలు ఫ్రెష్‌‌‌‌టు హోం, ఆనందా గ్రూప్‌‌‌‌, సీపీ ఆక్వాకల్చర్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ ప్రతినిధులు, టీఎస్ ఐఐసీ, మత్స్య, పరిశ్రమ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హబ్​శంకుస్థాపనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. రాష్ర్టానికి పెట్టుబడులు తీసుకురావడం, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా మంత్రి  కేటీఆర్ ప్రత్యేక చొరవతో ప్రభుత్వం ఆక్వా హబ్ చేపడుతోందన్నారు. ఆక్వాహబ్‌‌‌‌లో ఈ ప్రాంతానికి గొప్ప వరం లాంటిదని అన్నారు. సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాస్ రావు, ఆనంద్ గ్రూప్ ప్రతినిధి మురళి వర్మ, ఫిష్ ఇన్ కంపెనీ ప్రతినిధి అల్తాఫ్​ఖాన్, ప్రభాత్ కుమార్, జిల్లా మత్స్య అధికారి శివప్రసాద్, జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ ఉపెందర్ రావు పాల్గొన్నారు.