హైదరాబాద్, వెలుగు: మత్స్యకార వృత్తికి సంబంధించి వివాదాల పరిష్కారానికి కమిటీ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పలు తెగలను మత్స్యశాఖలో చేరుస్తూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, కొన్ని తెగలకు సొసైటీల్లో సభ్యత్వం ఇవ్వడం లేదు. దీంతో ఆ తెగలను పరిగణనలోకి తీసుకోకపోవడంపై దాఖలైన సుమారు 28 పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక ఇటీవల తీర్పు చెప్పారు. వివాదాల పరిష్కారం కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిపుణుల కమిటీని 3 నెలల్లో ఏర్పాటు చేసి, మరో మూడు నెలల్లో రిపోర్టు ఇవ్వాలని హైకోర్టు చెప్పింది. ఆ నివేదిక అందాక ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
బెస్త బోయి, గంగపుత్ర, గూండ్ల తెగలను చేపలు పట్టే వృత్తిలోకి పరిగణనలోకి తీసుకోకపోవడంపై నిపుణుల కమిటీని ఏర్పాటు లేదా ఈ వివాదాన్ని బీసీ కమిషన్‌కు నివేదించాలంటూ 2018 నుంచి 28 వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. మత్స్యకారుల సహకార సంఘాల్లో ఈ తెగలకు సభ్యత్వం ఇవ్వకపోవడాన్ని పిటిషనర్లు సవాల్ చేశారు. సహకార సంఘాల్లో సభ్యత్వానికి, నైపుణ్య పరీక్ష నిర్వహించడానికి జిల్లా మత్స్యశాఖ అధికారులు వెల్లడించిన ప్రొసీడింగ్స్‌ను కూడా పిటిషనర్లు సవాల్ చేశారు. ప్రభుత్వం, పిటిషనర్ల తరఫు వాదనలు విన్న తర్వాత నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి, నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.