తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటు చేయండి .. కోకాకోలా డైరెక్టర్​తో మంత్రులు

తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటు చేయండి ..   కోకాకోలా డైరెక్టర్​తో  మంత్రులు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో  పెట్టుబడులు పెట్టాలని కోకా-కోలా మేనేజ్ మెంట్ ను ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రులు.. శుక్రవారం అట్లాంటాలోని కోకా-కోలా హెడ్ క్వార్టర్స్ లో కంపెనీ అంతర్జాతీయ ప్రభుత్వ సంబంధాల గ్రూప్  డైరెక్టర్  జొనాథన్  రీఫ్ తో  సమావేశమయ్యారు.  దాదాపు గంటన్నర సేపు జరిగిన ఈ భేటీలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులపై మంత్రులు పవర్ పాయింట్  ప్రజంటేషన్  ఇచ్చారు. ఎక్కడ ప్లాంట్ స్థాపించినా అందుకు ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. భారతదేశంలో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మారిందని, గత రెండు దశాబ్దాలుగా హైదరాబాద్ లో అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని జొనాథన్ కు వివరించారు. 

తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానంపై సానుకూలంగా స్పందించిన జొనాథన్.. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని తెలిపారు. మంత్రుల వెంట ఐటీ ఇండస్ర్టీస్  ప్రిన్సిపల్  సెక్రటరీ జయేష్ రంజన్, ఇండస్ర్టీస్  స్పెషల్  సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు. అలాగే తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని డెల్టా ఎయిర్ లైన్స్ కంపెనీని మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్  రెడ్డి కోరారు. శుక్రవారం అట్లాంటాలోని డెల్టా ఎయిర్ లైన్స్  కార్యాలయంలో ఆ సంస్థ ఉపాధ్యక్షుడు, సీటీఓ నారాయణన్  కృష్ణకుమార్ తో వారు సమావేశమయ్యారు.