హైదరాబాద్: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి కేంద్రం షాకిచ్చింది. తెలంగాణలో ఉన్న ఏపీ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్లు తక్షణమే ఏపీలో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించడంతో ఆమ్రపాలికి ఊహించని పరిణామం ఎదురైంది. తనను తెలంగాణ కేడర్ అధికారిగా పరిగణించాలని ఆమ్రపాలి కోరినప్పటికీ కేంద్రం తిరస్కరించింది. అఖిల భారత సర్వీసుల్లో అధికారుల కేటాయింపు విషయంలో ఖండేకర్ కమిటీ ప్రతిపాదనలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. ఈ కమిటీ ఆమ్రపాలి అభ్యర్థన విషయంలో ఒక విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల్లో ప్రధానంగా ప్రస్తావించింది.
ఆమ్రపాలి తన యూపీఎస్సీ అప్లికేషన్లో తన పర్మినెంట్ అడ్రస్ను విశాఖపట్నంగా పేర్కొన్నారని తెలిపింది. అందువల్ల ఆమెను ఏపీ కేడర్కు కేటాయించారు. ఆమెను తెలంగాణ స్థానికురాలిగా గుర్తించి తెలంగాణ కేడర్కు పంపాలని ఆమ్రపాలి కోరినప్పటికీ ఆ అభ్యర్థనను ప్రత్యూష్ సిన్హా కమిటీ గతంలోనే తిరస్కరించింది. కేంద్రం ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఐఏఎస్ ఆమ్రపాలి ఏపీకి వెళ్లాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆమ్రపాలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం ఆసక్తికరంగా మారింది.
2010 బ్యాచ్‌కు చెందిన ఆమ్రపాలి ఐఏఎస్‌గా శిక్షణ పూర్తి చేసుకున్నాక తొలుత వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా, తర్వాత కొంతకాలం హైదరాబాద్‌లోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో పనిచేశారు. 2015లో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. అక్కడి నుంచి జీహెచ్‌ఎంసీ జాయింట్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. తెలంగాణ ఎలక్షన్ కమిషన్‌లో జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా పని చేశారు. 2020లో ఆమెకు ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు రావడంతో కేంద్ర సర్వీసుల్లో జాయిన్ అయి డిప్యూటీ కార్యదర్శిగా పనిచేశారు. డిప్యుటేషన్ పూర్తి కావడంతో తెలంగాణ రాష్ట్ర సర్వీసులో చేరారు. HMDA కమిషనర్గా ఆమ్రపాలి పనిచేశారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలి కొనసాగుతున్నారు.