రంగారెడ్డి: గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని యూనివర్శిటీలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, బీఆర్ఎస్ హయాంలో వర్శిటీలు పునరావాస కేంద్రాలుగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యూనివర్శిటీల ప్రక్షాళన చేపట్టి వీసీలను నియమించామని గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లాలోని మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన పాఠశాల వార్షికోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మొగిలిగిద్దలో నూతనంగా నిర్మించనున్న పాఠశాల భవనానికి సీఎం భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యపై చేసేది ఖర్చు కాదని.. భవిష్యత్‌పై పెట్టుబడి అన్నారు. విద్యాశాఖను నా దగ్గర పెట్టుకుని నిత్యం పర్యవేక్షిస్తున్నాని తెలిపారు. గత బీఆర్ఎస్ సర్కార్ కాస్మోటిక్, డైట్ చార్జీలను పెంచలేదని, మేం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కాస్మోటిక్ ఛార్జీలు పెంచామని గుర్తు చేశారు. డైట్ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలు 200 శాతం హైక్ చేశామని తెలిపారు.
ALSO READ | నేను కొడితే మాములుగా ఉండదు.. తెలంగాణ శక్తి ఏంటో చూపిస్తాం: కేసీఆర్
విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలు పెంచాలని యంగ్ ఇండియా స్కిల్ వర్శిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దేశంలో 140 కోట్ల జనాభా ఉన్నప్పటికీ ఒక్క గోల్డ్ మెడల్ రాలేదని.. అదే కోటీ మంది జనాభా ఉన్న ఉత్తర కొరియో దేశానికి 30 గోల్డ్ మెడల్స్ వచ్చాయన్నారు. అందుకే.. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడానికి స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నామని, వివిధ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఉద్యోగాలు, నగదు ప్రోత్సహకాలు అందజేస్తున్నామని తెలిపారు.
ఇక, 150 ఏళ్ల చరిత్ర కలిగిన మొగిలిగిద్ద పాఠశాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. మొగలిగిద్ద పాఠశాల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని అధికారులను ఆదేశించాని.. అధికారులు వెంటనే మొగిలిగిద్ద పాఠశాల నూతన భవన నిర్మాణానికి రూ.16 కోట్లు కేటాయించారని తెలిపారు. మొగిలిగిద్దలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మంజూరు చేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో టీచర్ పోస్టుల భర్తీ జరగలేదని.. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 11 వేల ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని తెలిపారు. గతంలో నోటిఫికేషన్లు ఇస్తే సంవత్సరాల తరబడి నియామక ప్రక్రియ జరిగేదని విమర్శించారు. మా ప్రభుత్వం 55 రోజుల్లోనే డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తి చేసిందన్నారు.