పోడు భూముల్లో సోలార్​ ప్లాంట్ల ఏర్పాటు : ఐటీడీఏ పీవో రాహూల్​ 

పోడు భూముల్లో సోలార్​ ప్లాంట్ల ఏర్పాటు : ఐటీడీఏ పీవో రాహూల్​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : గిరిజన రైతుల సంక్షేమంలో భాగంగా పీఎం కుసుమ్​ స్కీం ద్వారా వివాదం లేని పోడు భూముల్లో సోలార్​ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు ఐటీడీఏ పీవో బి. రాహుల్​ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్​ లో తహసీల్దార్లతో ఏర్పాటు చేసిన స్పెషల్​ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. వివాదం లేని పోడు భూముల్లో సోలార్​ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన ల్యాండ్స్​ను తహసీల్దార్లు గుర్తించాలన్నారు. సబ్​స్టేషన్ కు  మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న గిరిజన రైతుల భూములను గుర్తించాలని చెప్పారు.

ఆయా భూముల్లో సోలార్​ ప్లాంట్లను 90శాతం బ్యాంక్​ లోన్​తో ఇందిరా మహిళా శక్తి స్కీం కింద మహిళా గ్రూపులకు ఇవ్వనున్నట్టు తెలిపారు. మెగావాట్​ ప్లాంట్​ నుంచి ఏడాదికి దాదాపు 15లక్షల యూనిట్ల విద్యుత్​ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. ఈ కరెంట్​ఉత్పత్తితో ఏడాదికి రూ. 45లక్షల ఆదాయం లభిస్తుందని తెలిపారు. ఈ మీటింగ్​లో ఐటీడీఏ సహాయ ప్రాజెక్ట్​ అధికారి డేవిడ్​ రాజ్​ఉన్నారు. 

మార్కెట్​కు అనుగుణంగా వ్యాపారం చేయాలి

భద్రాచలం : చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్న లబ్ధిదారులంతా మార్కెట్​కు అనుగుణంగా వ్యాపారం చేయాలని పీవో సూచించారు. ఐటీడీఏ మీటింగ్​ హాల్​లో  మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ పరిశ్రమ కోసం సబ్సిడీపై రుణం తీసుకున్నారో ఆ యూనిట్​ పైనే ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఐటీడీఏ ఎల్లప్పుడూ యూనిట్​దారులకు సహకారం అందిస్తుందని చెప్పారు.

అశ్వాపురంలోని దాల్, భద్రాచలంలోని న్యూట్రీ బిస్కెట్, దుమ్ముగూడెంలోని చిక్కి యూనిట్​ సభ్యులు నిర్వహణ పట్ల అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని, తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. అందరూ సమన్వయంతో యూనిట్​ను నడుపుకుంటామని హామీ ఇస్తే ఐటీడీఏ నుంచి రూ.5లక్షల రుణసాయం కల్పిస్తామన్నారు. 

పాల్వంచ : పాల్వంచ పట్టణంలోని నవ లిమిటెడ్ ఆధ్వర్యంలో గల మహిళా సాధికార కేంద్రాన్ని పీవో సందర్శించారు. ఇంటికి అవసర మైన గృహపకరణాలు, బ్యూటీషియన్, వెదురుతో అలంకార వస్తువుల తయారీ,పెయింటింగ్, కుట్లు , అల్లిక ల ద్వారా మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని, అందుకోసం మహిళా సంఘాలు, బ్యాంకు లింకేజీల ద్వారా రుణాలు అందజేస్తామని ఆయన తెలిపారు.

పై చదువులు చదువు కున్న నిరుద్యోగ గిరిజన మహిళలు ఇటువంటి కేంద్రాల్లో శిక్షణ తీసుకొని పదిమందికి ఉపాధి బాట చూపాలని కోరారు. నవభారత్ సంస్థ ఉపకార వేతనం అందిస్తూ శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు.