పకడ్బందీగా ఈవీఎంల కమీషనింగ్ ప్రక్రియ : కలెక్టర్ బదావత్ సంతోష్

పకడ్బందీగా ఈవీఎంల కమీషనింగ్ ప్రక్రియ : కలెక్టర్ బదావత్ సంతోష్

నస్పూర్/బెల్లంపల్లి, వెలుగు : ఈ నెల 30న జరుగనున్న ఎన్నికల కోసం ఈవీఎంల కమీషనింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్ల కమీషనింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 743 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరుగుతుందన్నారు.

ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ప్రక్రియ నిర్వహించాలని అధికారులు, సిబ్బందికి సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల రిటర్నింగ్ ఆఫీసర్ రాములు, ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం యంత్రాల కమీషనింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించామని ఎన్నికల సాధారణ పరిశీలకులు బిశ్వజిత్ దత్తా అన్నారు.

బెల్లంపల్లి పట్టణం బజార్ ఏరియాలోని జిల్లా పరిషత్ హైస్కూల్​లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్​ను గురువారం ఆయన తనిఖీ చేశారు. బెల్లంపల్లి రిటర్నింగ్ అధికారి, జిల్లా అడిషనల్ కలెక్టర్ బి.రాహుల్​తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సమక్షంలో బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీ ప్యాట్ల కమీషనింగ్ ప్రక్రియ నిర్వహించారు. 

Also Read :- సంగారెడ్డికి మెట్రో రైలు తెస్తా : మంత్రి హరీశ్ రావు