ఎకానమీని సెట్‌‌ చేసుడు పెద్ద సవాలే!

వరుసగా కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌‌లను ఎదుర్కొన్న నరేంద్ర మోడీ సర్కారుకు ఎకానమీ రూపంలో మరో సవాల్‌‌ సిద్ధంగా ఉంది. ఈ మహమ్మారి కారణంగా మన దేశ ఆర్థిక వ్యవస్థపై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. దీంతో ఎకానమీ గ్రోత్‌‌ రేట్ ఘోరంగా పడిపోతోంది. దీనిని మళ్లీ సెట్ చేసి ట్రాక్‌‌లోకి పెట్టడం కచ్చితంగా పెద్ద సవాలే. ఇన్వెస్టర్లకు మోడీ సర్కారు  సుమారు రూ.10 లక్షల కోట్ల రిలీఫ్ ప్యాకేజీ అందేలా చర్యలు తీసుకుంటున్నా .. వాళ్లు పొందిన లబ్ధి దేశంలో మళ్లీ పెట్టుబడుల రూపంలో రాకపోవడమే ఇక్కడ అతి పెద్ద సమస్యగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు పెట్టుబడుల రూపంలోకి తీసుకురాగలిగినప్పుడే ఎకానమీ కిక్‌‌ స్టార్ట్ అవుతుంది. దాని ద్వారా ఉపాధి, ఉద్యోగాలు పెరిగి ప్రజల జీవన ప్రమాణాలతో పాటు, జీడీపీ గ్రోత్‌‌ రేట్‌‌ కూడా క్రమంగా గాడిన పడుతుంది.

నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక ఆర్థిక పరంగా సెట్ చేసుకుకున్న రెండు అతి పెద్ద గోల్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయడం, రెండోది ఇండియన్ ఎకానమీని ఐదు ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లడం. కానీ కరోనా మహమ్మారి ఎఫెక్ట్‌‌తో గత ఏడాది నుంచి ఎకానమీ గ్రోత్‌‌ రేట్ క్షీణిస్తోంది. కొంత వరకూ వ్యవసాయ పనులు ఈ కరోనా క్రైసిస్‌‌లోనూ సాగుతున్నప్పటికీ, ఇతర రంగాల్లో ఉపాధి, ఉద్యోగాలు కోల్పోవడం ముందెన్నడూ లేనంతటి స్థాయిలో చూస్తున్నాం. ఈ పరిస్థితిలో ఎకానమీ గ్రోత్‌‌ రేట్ పుంజుకునేలా చేయడం ప్రధాని మోడీ ముందున్న పెద్ద సవాల్. 75 ఏండ్ల స్వాతంత్ర్యాన్ని పురస్కరించుకొని అమృతోత్సవ్ జరుపుతున్న నేపథ్యంలో దేశ స్థితిగతులు ఏ రంగంలోనూ దిగజారిపోకుండా చూసుకుని భారత్ ప్రతిష్ట కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సీఎంఐఈ లెక్కలు..
మన దేశ ఆర్థిక పరిస్థితిపై ఇటీవలే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ఒక సర్వే రిపోర్ట్ విడుదల చేసింది. దాని లెక్కలను చూస్తే పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తోంది. దేశంలో 23 కోట్ల మంది పేదరికంలోకి జారిపోయారని, జనవరి నుంచి ఏప్రిల్ మధ్యనే సుమారు కోటి మంది జాబ్స్‌‌ కోల్పోయారని సీఎంఐఈ తేల్చింది. 1979-80ల్లో జనతా సర్కారు పాలన తర్వాత మళ్లీ ఈ ఏడాదిలోనే గ్రోత్ రేట్ మైనస్ 7.3 శాతానికి పడిపోయిందని లెక్కగట్టింది. దేశంలో 97 శాతం మంది ఆదాయం పడిపోయిందని ఈ సంస్థ చెబుతోంది. పట్నాలు, పల్లెల్లోనూ ప్రజల తలసరి ఆదాయం తగ్గి, పేదరికం భారీగా పెరిగిందని గుర్తించింది. ఎఫ్‌‌సీఐ గోడౌన్స్‌‌లో భారీగా ధాన్యం మూలుగుతున్నప్పటికీ దేశంలో కోట్ల మంది ఆకలితో పస్తులుంటున్నారన్నది అన్నింటికీ మించిన చేదు నిజం.
వరుస వేవ్‌‌లతో మరింత ఎఫెక్ట్
కరోనా కంటే ముందే ఎకానమీ స్లో డౌన్‌‌ మొదలైంది. మహమ్మారి రాకతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. నోట్ల రద్దు, ప్లానింగ్ లేని జీఎస్టీ అమలుతో 2017 నుంచి వరుసగా పదకొండు ఫైనాన్సియల్ క్వార్టర్స్‌‌లో ఎకానమీ దిగజారుతూ వచ్చింది. మోడీ ప్రభుత్వం దీనిని కట్టడి చేసి, ఎకానమీ గ్రోత్‌‌ను దారిలో పెట్టేందుకు చేసిన ప్రయత్నాల్లో కొంత మేరకే సక్సెస్‌‌ అయింది. నిరుద్యోగం రేటు పెరుగుతుండడంతో జనాల ఇన్‌‌కం తగ్గిపోవడం, తయారీ రంగంతో పాటు ఎంఎస్ఎంఈలు కుదేలవడంతో కరోనాకు ముందే ఎకానమీ దెబ్బతిన్నది. దెబ్బ మీద దెబ్బలా కరోనా ఫస్ట్ వేవ్‌‌ రావడంతో ఎకానమీ క్రైసిస్ మరింత తీవ్రమైంది. లాక్‌‌డౌన్‌‌ కారణంగా చిన్న చిన్న వ్యాపారాలు, ఎంఎస్‌‌ఎంఈలు కొన్ని నెలల పాటు పూర్తిగా మూతపడ్డాయి. వలస కూలీలు వందల కిలోమీటర్లు నడిచి తమ సొంతూళ్లకు వెళ్లడంతో గతంలో ఎప్పుడూ చూడనంత స్థాయిలో ఉపాధి కోల్పోయిన పరిస్థితి ఎదురైంది. ఈ ఏడాది మొదట్లో అప్పుడప్పుడే అంతా నార్మల్ అవుతుందన్న టైమ్‌‌లో మళ్లీ కరోనా సెకండ్ వేవ్ రావడంతో ఎకానమీపై మరింత ఎఫెక్ట్ పడింది.
పబ్లిక్ స్పెండింగ్‌‌ పెరగాలి
ఈ ఎకనమిక్ క్రైసిస్‌‌ నుంచి బయటపడడాని కరెన్సీ ప్రింటింగ్ భారీగా పెంచాలని నోబెల్ గ్రహీత, ప్రముఖ ఎకనమిస్ట్ అభిజిత్ బెనర్జీ చేసిన సూచనను కేంద్రం సీరియస్‌‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా మహమ్మారితో పోరాడుతున్న ఈ సమయంలో డెఫిసిట్ కంట్రోల్‌‌ గురించి ఆలోచించక్కర్లేదు. ఇప్పటికే కేంద్రం అంచనా వేస్తున్న డెఫిసిట్ 5.5 శాతంగా ఉంది. ఇది అదనంగా ఇంకొక్క శాతం పెరిగినా ముంచుకొచ్చే ప్రమాదం ఏమీ లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం పబ్లిక్ స్పెండింగ్‌‌కు ఎక్కువ నిధులు ఇచ్చి నేరుగా ప్రజల చేతుల్లోకే డబ్బు చేరవేయడం మినహా ఎకనమిక్ యాక్టివిటీని పెంచే మార్గం మరొకటి లేదు. ఈ రకంగా చేస్తేనే జనంలో ఖర్చు పెట్టే శక్తి పెరిగి, మూతపడుతున్న తయారీ రంగం కూడా మళ్లీ గాడినపడుతుంది. అలాగే ఉపాధి కూడా పెరగడంతో మొత్తంగా మనీ రొటేషన్ పెరిగి, ఆర్థిక వృద్ధి రేటు సెట్ అవ్వడానికి సాయపడుతుంది. ఈ విషయంలో వెనుకడుగేస్తే ఎకానమీ గ్రోత్‌‌ రేట్ మరింత దిగజారుతుందనడంలో సందేహం లేదు.
బ్లూ ప్రింట్ రెడీ చేయాలె
వరుస కరోనా వేవ్‌‌లతో కుదేలైన ఎకానమీ రివైవల్ కోసం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని సర్కారు ఓ బ్లూ ప్రింట్ రెడీ చేయాల్సిన అవసరం ఉంది. ఇందు కోసం ఆయన ఒక స్పెషల్ టాస్క్‌‌ ఫోర్స్ వేయాలి. మాజీ ఆర్బీఐ గవర్నర్లు రఘురామ్‌‌ రాజన్, ఉర్జిత్ పటేల్, మాజీ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రమణియన్ సహా మరికొందరు ఆర్థిక రంగంలో నిపుణులైన వ్యక్తులతో ఒక కమిటీ వేయడం ద్వారా ఎలాంటి చర్యలతో మన ఆర్థిక వ్యవస్థను పుల్ స్వింగ్‌‌లోకి తీసుకురావచ్చన్న దానిపై అధ్యయనం చేయించాలి. గతంలో ఇండియన్ ఎకానమీ క్రైసిస్‌‌లో ఉన్న టైమ్‌‌లో టాప్ పొజిషన్లలో ఉన్న వీరు ప్రస్తుత సమస్యను పరిష్కరించేందుకు సరైన ప్రణాళికలు సిద్ధం చేసి రిపోర్ట్ అందించగలరు. పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారుల్లో కాన్ఫిడెన్స్ పెంచే చర్యలతో రూట్ మ్యాప్ రెడీ చేసి ప్రభుత్వానికి సాయపడే సామర్థ్యం వారిలో ఉంది.
త్రీ పాయింట్ ఫార్ములా
ఎకానమీ మరింత అధ్వాన్నమైన పరిస్థితిని ఫేస్‌‌ చేసే ముందు కంట్రోల్ చేయాలంటే దీర్ఘ కాలిక ప్రణాళికను ఎంచుకోవచ్చు. ఇందులో భాగంగా త్రీ పాయింట్ ఫార్ములాను ఫాలో అవ్వొచ్చు. వీటిని దీర్ఘకాలంలో ఇంప్లిమెంట్ చేసి సక్సెస్‌‌ సాధించేలా కేంద్రం ప్రయత్నించాలి.  

ప్రస్తుత పరిస్థితుల్లో పలు రంగాలపై ప్రభుత్వం నిధుల ఖర్చును భారీగా పెంచడమే ఎకనమిక్ యాక్టివిటీని పుంజుకునేలా చేసే బెస్ట్ ఆప్షన్. మార్కెట్‌‌లో డిమాండ్ పెంచేందుకు జనం చేతుల్లో డబ్బులు ఉండాలి. ఇందుకోసం కేంద్రం నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌‌ఫర్ ద్వారా పేదల అకౌంట్లలో డబ్బు వేయాలి. కరోనా క్రైసిస్ కారణంగా దేశంలో అట్టడుగు వర్గాలు, నిరు పేదలు.. ఎవరూ ఆకలితో పస్తులు పడుకునే పరిస్థితి రాకూడదు. ఇందుకోసం మరికొన్ని నెలల పాటు ఫ్రీ రేషన్ అందేలా చర్యలు తీసుకోవాలి. ఈ సూచనలన్నీ పలువురు ప్రముఖ ఎకనమిస్టులు సూచిస్తున్నవే.  ఈ మూడు పాయింట్లను ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఎకానమీ కుదేలవడం కారణంగా మరింత పేదరికంలో పడిపోయిన వర్గాలకు ఆకలి తీర్చడంతో పాటు ఉపాధి కూడా కల్పించవచ్చు. ఫస్ట్ వేవ్‌‌ సమయంలో రూ.20 లక్షల కోట్ల ఆత్మ నిర్భర ప్యాకేజీ ప్రకటించిన దాని వల్ల పెద్దగా ప్రజలకు మేలు జరిగిందేమీ కనిపించడం లేదు.

                                                                                                                                                           - పర్సా వెంకట్,పొలిటికల్ ఎనలిస్ట్