దారి దోపిడీ కేసులో ఏడుగురు అరెస్ట్​ : ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్

దారి దోపిడీ కేసులో ఏడుగురు అరెస్ట్​ : ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: దారి దోపిడీ కేసులో ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. శనివారం తన కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు.  పెంట్లవెల్లి మండల కేంద్రానికి చెందిన బంగారు, వెండి దుకాణాల నిర్వాహకులు ఈ నెల 6న రాత్రి హైదరాబాద్​నుంచి బంగారం, వెండి కొనుగోలు చేసి, కారులో వస్తున్నారు.

 కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి కేఎల్ఐ దగ్గర కొల్లాపూర్​ నియోజకవర్గానికి చెందిన బొలెమోని బాబు, బొలెమోని అంజి, నందిమల్ల హరి గణేశ్, యాత రవి, పుట్టపాకుల శ్రీకాంత్, గిరిధర్ నాయుడు, సాయికుమార్, హరికృష్ణ, అఖిల్​ వారి కారుపై దాడి చేశారు.  10 తులాల బంగారం, 22 తులాల వెండితో పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు.

శనివారం కొల్లాపూర్​ మండల కేంద్రంలో వాహనాల తనిఖీ చేపడుతుండగా ఒక కారు, రెండు బైక్​లపై వెళ్తున్న వ్యక్తులు ఏడుగురు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చోరీ చేసినట్లు తెలిపారు.  దీంతో, వారి వద్ద నుంచి బంగారం, వెండి, 7 ఫోన్లు,  కారు, బైక్​లు స్వాధీనం చేసుకొని, బాబు, అంజి, హరి గణేశ్, రవి, శ్రీకాంత్,  గిరిధర్ నాయుడు, సాయికుమార్ లను అరెస్టు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు.  మిగతా ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. డీఎస్పి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

చోరీ కేసులో ముగ్గురు.. 

 పాలమూరు, వెలుగు: చోరీ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ జానకి తెలిపారు. శనివారం తన  కార్యాలయంలో  వివరాలు వెల్లడించారు.  మహబూబ్​నగర్​ రూరల్​ మండలంలోని అడవి వెంకటాపూర్​కు చెందిన దుప్పటిగట్టు అంజమ్మ, మరో మహిళ అడ్డా కూలీలుగా పని చేస్తున్నారు. వారు ఈ నెల 13న టీటీగుట్ట అడ్డా వద్ద పని కోసం వేచిచూస్తుండగా మహమ్మదాబాద్​ మండలం చౌడాపూర్​తండాకు చెందిన కాట్రావత్ భరత్, కోస్గి మండలం మల్లారెడ్డి పల్లికి చెందిన కామారం నరేశ్, అన్వాడ మండలం కంకర గ్రామానికి చెందిన సామ శోభ అక్కడికి వచ్చారు.  

పని ఉందని, ఆటోలో ఎక్కించుకొని తొలుత దొడ్డలోనిపల్లి, అక్కడినుంచి జడ్చర్ల మీదుగా మయూరి పార్క్​ఏరియాలో రోడ్డు పక్కనున్న పొదల్లోకి తీసుకెళ్లారు. వారిని తీవ్రంగా కొట్టి, కాళ్ల కడియాలు, మెడలోని పుస్తెలతాడు, బంగారు గుండ్ల గొలుసు తీసుకొని, పారిపోయారు. అంజమ్మ భర్త  సత్తయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వన్ టౌన్ సీఐ  అప్పయ్య ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి, శనివారం అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను అభినందించారు. అడిషనల్ ఎస్పీ రాములు, డీఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులు 
పాల్గొన్నారు.