
కొన్ని కోట్ల మందిలాగే వారు కూడా మహా కుంభమేళాలో పాల్గొనాలనుకున్నారు. అయితే.. ప్రయాగ్ రాజ్ కు వెళ్లే రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయి వందల కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జాం ఏర్పడిన వార్త వారిని కలవరపరిచింది.
రైల్లో వెళదామంటే జనం భారీగా ఉన్నారు. ఎలాగైనా కుంభమేళాకు వెళ్లితీరాల్సిందే అనుకున్నారు బిహార్ లోని బుక్సర్ లో కమ్ హరియా గ్రామానికి చెందిన ఆ ఏడుగురు. బాగా ఆలోచించిన తర్వాత వారికి ఓ మెరుపు ఐడియా వచ్చింది. ట్రాఫిక్ కష్టాలు, రైళ్లలో జనం రద్దీని తప్పించుకోవడానికి పడవలో ప్రయాణించి ప్రయాగ్ రాజ్ కు చేరుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఏర్పాట్లు చేసుకున్నారు.
ఒక పడవను సమకూర్చుకుని రెండు మోటార్లు పెట్టారు (ఒక మోటార్ బ్యాకప్ కోసం). ఆహారం, నీరు తదితర రేషన్ సామగ్రిని వెంట తీసుకెళ్లారు. ఈ నెల 11న జర్నీ ప్రారంభించి 550 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. 13న ప్రయాగ్ రాజ్ కు చేరుకుని కుంభమేళాలో పాల్గొన్నారు. తిరిగి ఈనెల 16న వారి స్వగ్రామానికి చేరుకున్నారు.