పదిహేను రోజుల్లో 7 బ్రిడ్జ్‌లు నేలమట్టం.. బీహార్‌లో ఏం జరుగుతుంది?

పదిహేను రోజుల్లో 7 బ్రిడ్జ్‌లు నేలమట్టం.. బీహార్‌లో ఏం జరుగుతుంది?

ఒకటి, రెండు వంతెనలు కూలిపోయాయి అంటే వర్షకాలం కదా.. వరద ఉదృతికి జరిగి ఉండొచ్చని అనుకోవచ్చు. కానీ బిహర్ రాష్ట్రంలో గడిచిన 15రోజుల్లో  ఏడు బ్రిడ్జ్ లు నేలమట్టం అయ్యాయి. జూలై 3(ఈరోజే) రెండు వంతనలు కూలిపోయాయి. ఇందులో ఒకటి సుమారు 35 ఏళ్ల నాటి బ్రిడ్జ్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా మరమ్మతులు చేయించలేదట. ఒకటి 1998లో, మరోకటి 2004లో నిర్మించారు. దీంతో నిర్వహణ లేక వర్షాల వల్ల వచ్చిన వరద కారణంగా కూలిపోయాయి. ఇంతకంటే ముందు బిహార్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 5 వంతెనలు కూలిపోయాయి. ఈ సంఘటనలపై దర్యాప్తు చేయడానికి బీహార్ ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.

జూన్ 27న కిషన్ గంజ్ జిల్లాలో కంకయీ ఉపనదిపై నిర్మించిన బ్రిడ్జి కుంగిపోయింది. దీంతో బహదూర్ గంజ్, దిఘాల్ బ్యాంక్ బ్లాక్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. కంకయీ, మహానంద నదులను కలిపే మడియా ఉపనదిపై 2011లో 70 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో ఈ బ్రిడ్జి  నిర్మించారు. 

ఈస్ట్ చంపారన్​ జిల్లాలోని ఘోరసహన్ బ్లాక్  నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి ఉన్నట్టుండి జూన్ 24న కుప్పకూలింది. ఆ సమయంలో బ్రిడ్జి చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ బ్రిడ్జిని రూరల్ వర్క్స్​ డిపార్ట్ మెంట్ నిర్మిస్తోంది. పదహారు మీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జిని పూర్తిచేయడానికి ప్రభుత్వం రూ.1.5 కోట్లు కేటాయించింది. 

సివాన్ జిల్లాలో  దారౌండా, మహారాజ్‌‌గంజ్ గ్రామాల మధ్య నిర్మించిన వంతెన జూన్ 22 తెల్లవారుజామున 5 గంటలకు కుప్పకూలింది.
ఇటీవల మధుబని, అరారియా, తూర్పు చంపారన్ మరియు కిషన్‌గంజ్ వంటి జిల్లాల్లో చిన్నపాటి వరద నీటికే వంతెనలు కూలిపోయాయి.