![కడసారి మజిలీ.. కన్నీటి కడలి .. మధ్యప్రదేశ్ యాక్సిడెంట్ మృతుల అంతిమ సంస్కారాలు పూర్తి](https://static.v6velugu.com/uploads/2025/02/seven-hyderabad-pilgrims-returning-from-maha-kumbh-killed-in-madhya-pradesh-accident_pjPGudFrLo.jpg)
- ఉదయమే రెండు అంబులెన్సుల్లో గాంధీకి..
- అక్కడి నుంచి స్వస్థలాలకు..
- సిటీలోని కార్తికేయ నగర్, వివేకానంద నగర్, తార్నాకలో విషాద వాతావర
నాచారం/దిల్ సుఖ్‌నగర్/పద్మారావునగర్, వెలుగు: ప్రయాగ్ రాజ్‌లోని కుంభమేళాకు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు బుధవారం నగరానికి చేరుకున్నాయి. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్జిల్లా కేంద్రం సమీపంలో ప్రమాదం జరగ్గా నాచారం కార్తికేయనగర్‌కు చెందిన శశికాంత్ , మల్లారెడ్డి , సంతోష్ కుమార్, రవికుమార్, ఎర్రకుంట కాలనీకి చెందిన డ్రైవర్బాలరాజు, తార్నాక కు చెందిన ప్రసాద్, గడ్డిఅన్నారం ప్రాంతంలోని వివేకానందనగర్‌కు చెందిన ఆనంద్ కుమార్ ఉన్నారు. వీరి మృతదేహాలకు అక్కడే పోస్ట్‌మార్టం నిర్వహించి రెండు ఆంబులెన్సుల్లో గాంధీ ముందుగా దవాఖానకు తీసుకువచ్చారు.
ప్పల్ తహసీల్దార్ వాణి రెడ్డి ఆధ్వర్యంలో డెడ్ బాడీలను కుటుంబసభ్యులకు చూపించి, నిర్ధారించుకొని అప్పగించారు. మృతులకు సంబంధించిన బ్యాగులు, ఇతర సామాగ్రిని కూడా అప్పగించారు. మల్లారెడ్డి , రవికుమార్ మృతదేహాలు నాచారం కార్తికేయనగర్ కు తీసుకువచ్చి మల్లాపూర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. తార్నాక గోకుల్ నగర్ లో ఉండే టీవీ ప్రసాద్ అంతిమకార్యక్రమం సికింద్రాబాద్ బన్సిలాల్ పేట్లో నిర్వహించారు.
ఎర్రకుంట కాలనీకి చెందిన డ్రైవర్ బాలరాజు మృతదేహాన్ని కాలనీకి తీసుకువచ్చి తర్వాత అతడి స్వస్థలమైన జనగామ జిల్లా రఘునాథ్ పల్లి మండలం ఆర్ఆర్ బంగ్లాకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆ కాలనీల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు, తెలిసినవారు భారీగా తరలివచ్చి కడసారి వీడ్కోలు పలికారు. గడ్డిన్నారం వివేకానందనగర్ లో ఉండే గోల్కొండ ఆనంద్ కుమార్ చారి, కార్తికేయనగర్‌కు చెందిన సంతోష్కుమార్అక్కాచెల్లెళ్ల పిల్లలు కావడంతో ఇద్దరి అంత్యక్రియలు అంబర్‌పేట గోల్నాక శ్మనవాటికలో నిర్వహించారు.
పెద్దదిక్కును కోల్పోయాం..
ఎర్రకుంట కాలనీకి చెందిన డ్రైవర్ రాజు భార్య మహేశ్వరి భర్త మృతదేహాన్ని చూసి తట్టుకోలేకపోయింది. అతడి మృతదేహం పడి రోదించిన తీరు ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టించింది. తన కుటుంబ పెద్దదిక్కును కోల్పోయామని బోరును విలపించింది. ‘సంతోష్కుమార్భార్య చనిపోయి సంవత్సరం కూడా కాలేదు. ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఇప్పుడతడు కూడా ఆమె దగ్గరకే వెళ్లిపోయాడు..పాపం పిల్లల పరిస్థితి చూస్తేనే గుండె తరుక్కుపోతుంది’ అని చుట్టుపక్కల వారు మాట్లాడుకోవడం వినిపించింది.
15 రోజుల్లో బిడ్డ పెండ్లి.. అంతోలోనే..
మరో మృతుడు రాంపల్లి రవికుమార్ కు భార్య కూతురు, కొడుకు ఉన్నారు. ఇతడి కొడుక్కి ఏడాది కిందటే పెండ్లి చేశాడు. కూతురికి ఫిబ్రవరి 17న అంగరంగ వైభవంగా ఎంగేజ్ మెంట్ జరిపించాడు. ఈ నెల 27న పెండ్లి కూడా పెట్టుకున్నారు. పెండ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. ఈలోగా పనులు కొడుక్కి అప్పజెప్పి పుణ్యస్నానం చేసి వద్దామని ప్రయాగ్రాజ్వెళ్లాడు. ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో కన్నుమూశాడు.
పది మందికి సాయం చేసే గుణం
తార్నాక గోకుల్ నగర్ లో ఉంటూ బ్యాంక్జాబ్చేసే టీవీ ప్రసాద్ కు మంచి పేరుంది. అపార్ట్‌మెంట్‌తో పాటు ఎవరు కష్టాల్లో ఉన్నా, ఆపద వచ్చినా ప్రసాదన్నా అంటూ అందరూ ఆయన దగ్గరకు వస్తారు. తన దగ్గరకు వచ్చేవారికి కాదనకుండా సాయం చేసే గుణం ఆయనదని చుట్టుపక్కల వారు చెప్పారు. మృదుస్వభావి అయిన ప్రసాద్లేడంటే నమ్మకలేకపోతున్నామని అపార్ట్మెంట్ వాసులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
నాన్నా .. లే నాన్నా..
‘కుంభమేళాలో పుణ్యస్నానం చేసిన..ఇంటికి వస్తున్నా అని చెప్పిండు..అంతలోనే చనిపోయాడన్న వార్త వినాల్సి వచ్చింది ’అంటూ ఆనంద్కుమార్చారి భార్య రాధ భర్త మృతదేహంపై పడి రోదించింది. ఆనంద్ కుమార్ ఇద్దరు కొడుకులు అశ్రిత్, జశ్వంత్ ‘నాన్నా లే నాన్నా ’ అంటూ ఏడ్వడం చూసి అక్కడున్నవారంతా కన్నీరు పెట్టారు. లాల్ దర్వాజకు చెందిన ఆనంద్ తల్లిదండ్రులు 40 ఏండ్ల కింద వివేకానందనగర్ కు వచ్చి సొంతిల్లు కట్టుకుని ఉంటున్నారు. ఆనంద్ కు సలీంనగర్ లో బంగారు దుకాణం ఉంది. పిల్లల చదువుల నేపథ్యంలో మూడేండ్ల కింద మూసారాంబాగ్ కు మారాడు. పండుగల, ఫంక్షన్ల టైంలో కుటుంబంతో కలిసి వివేకానందనగర్‌లోని ఇంటికి వచ్చి వెళ్లేవాడు.
కలిసే ఉన్నారు..కలిసే పోయారు
వివేకానందనగర్‌కు చెందిన గోల్కొండ ఆనంద్‌కుమార్, నాచారంలోని కార్తికేయనగర్‌కు చెందిన సంతోష్‌కుమార్ ఇద్దరూ అక్కాచెల్లెళ్ల పిల్లలు..చిన్నప్పటి నుంచి ఇద్దరూ కలిసి మెలిసి ఉండేవారు. కష్టసుఖాల్లో ఇద్దరూ ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉండేవారు. ఆ చనువుతోనే ప్రయాగ్‌రాజ్ లో పుణ్యస్నానానికి ఇద్దరూ కలిసే వెళ్లారు. అక్కడ జరిగిన ప్రమాదంలో ఇద్దరూ కన్నుమూశారు. దీంతో ఇద్దరి అంత్యక్రియలను అంబర్‌పేట గోల్నాక శ్మశానవాటికలో నిర్వహించారు.