దేవరకొండ, వెలుగు : ఏడుగురు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన పీఏపల్లి మండలం దుగ్యాల గ్రామ ఆదర్శ పాఠశాలలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం దుగ్యాల గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో ఏడుగురు ఇంటర్విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని సిబ్బంది దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దేవరకొండ ఆస్పత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు.
ఆస్పత్రి సూపరింటెండెంట్ మంగతానాయక్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆహారం తీసుకోకపోవడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని కలెక్టర్ తెలిపారు. ఈ ఘటన కారణమైన పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని దేవరకొండ ఆస్పత్రి ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేశారు. విద్యార్థులను పరామర్శించిన వారిలో ఆర్డీవో రమణారెడ్డి, డీఎస్సీ గిరిబాబు, తహసీల్దార్లు శ్రీనివాసరావు, కిరణ్, సీఐ నరసింహులు తదితరులు ఉన్నారు.