ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్ కారు.. ఏడుగురు మృతి

ఆదివారం(ఏప్రిల్ 21) శ్రీలంకలోని ఉవా ప్రావిన్స్‌లో జరిగిన మోటార్ కార్ రేసింగ్ ఈవెంట్‌లో విషాదం చోటుచేసుకుంది. రేసింగ్‌లో పాల్గొన్న కారు ట్రాక్ నుండి అదుపుతప్పి ప్రేక్షకులపైకి దూసుకెళ్లడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది.

దియాతలావాలోని సెంట్రల్ హిల్ రిసార్ట్‌లో జరుగుతున్న రేసింగ్ ఈవెంట్‌లో పోటీపడుతున్న కారు ట్రాక్‌పై నుండి పక్కకు వెళ్లి ప్రేక్షకులను ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుల్లో నలుగురు ట్రాక్ అసిస్టెంట్లు ఉన్నట్లు ఓ పోలీసు అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. గాయపడ్డ వారిని హుటాహుటీన సమీప ఆస్పత్రులకు తరలించారు. గాయపడ్డ వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.