ఆంద్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెండ్లి బృందం ప్రయాణిస్తున్న వ్యాను కొండపై నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. రాజానగరం మండలం వెలుగుబందా, గోకవరం మండలం ఠాకూర్ పాలెంకు చెందిన వధూవరులకు రాత్రి తంటికొండ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహం జరిగింది. వేడుక పూర్తయిన తర్వాత కొత్త దంపతులతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు మొత్తం 22 మంది వ్యానులో కొండపై నుంచి తిరిగు ప్రయాణమయ్యారు. ఇదే సమయంలో వ్యాను బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి మెట్ల మార్గం ద్వారా కిందకు పడిపోయింది.
వ్యానులో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురు స్పాట్ లో చనిపోయారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వారిని రాజమండ్రిలోని ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. మృతులు కంబాల భాను, సింహాద్రి ప్రసాద్, ఎల్లా లక్ష్మీ, ఎల్లా దివ్యశ్రీలక్ష్మీ, చాగంటి యోహిని, పచ్చకూర నరసింహగా గుర్తించారు.