మధ్యప్రదేశ్‎లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి.. 14 మందికి గాయాలు

మధ్యప్రదేశ్‎లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి.. 14 మందికి గాయాలు

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (ఎస్‌యూవీ) ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారు. మరో 14 మంది గాయపడ్డారు. సిద్ధి-బహ్రీ రోడ్డులోని ఉప్ని పెట్రోల్ పంప్ సమీపంలో సోమవారం (మార్చి 10) తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

ఈ ఘటనపై డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గాయత్రి తివారీ మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులతో కూడిన ఎస్‌యూవీ మైహార్ వైపు వెళుతుండగా, అదే సమయంలో సిద్ధి నుండి బహ్రీకి వెళ్తోన్న ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్నాయని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులు మరణించగా.. మరో 14 మంది ఇతర ప్రయాణికులు గాయపడ్డారని వెల్లడించారు.

ALSO READ | కుల్ భూషణ్ జాదవ్‎ను పట్టించిన స్కాలర్ హత్య

 తీవ్రంగా గాయపడిన 9 మందిని మెరుగైన చికిత్స కోసం రేవాకు తరలించామని చెప్పారు. మిగిలిన వారు సిద్ధి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ట్రక్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని.. తదుపరి విచారణ కొనసాగుతోందని ఆమె తెలిపారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.