ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన ఏడుగురు కార్మికులను బలూచిస్తాన్‌లో వేర్పాటువాద మిలిటెంట్లు కాల్చి చంపారు. ముల్తాన్ నగరానికి చెందిన ఆ కార్మికులు పంజ్‌గుర్ పట్టణంలోని నిర్మాణంలో ఉన్న ఓ భవంతిలో రాత్రి నిద్రిస్తూ ఉండగా.. మిలిటెంట్లు వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఓ కార్మికుడు గాయంతో తప్పించుకున్నాడు. మరొక కార్మికుడు ఆ సమయంలో అక్కడ లేకపోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీయే ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని అనుకుంటున్నామని చెప్పారు. కార్మికుల హత్యను ప్రధాని షెహబాబ్ షరీఫ్ ఖండించారు. ఆ ఘటనపై రిపోర్టు ఇవ్వాలని బలూచిస్తాన్ సీఎం మిర్ సర్ఫరాజ్‌ను ప్రధాని ఆదేశించారు. తమ దేశం నుంచి టెర్రరిజంను కూకటివేళ్లతో పెకలిస్తామని, అందుకు తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని పేర్కొన్నారు.