ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో దూసుకెళ్లిన మినీ లారీ బోల్తా పడి ఏడుగురు కార్మికులు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామం నుంచి మినీలారీ జీడిపిక్కల లోడ్‌తో వెళ్తుండగా తూర్పు గోదావరి జిల్లాలోని దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో మంగళవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఆరుగురు తాడిమళ్లకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. సత్తిపండు, సత్యనారాయణ, తాడి కృష్ణ, ప్రసాద్, బూరయ్య, చినముసలయ్య, పి.కృష్ణలుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. పరారీలో ఉన్న మినీలారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.