భద్రాచలం, వెలుగు: చత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం ఏడుగురు మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ కిరణ్‌చౌహాన్ తెలిపారు. కోబ్రా, సీఆర్పీఎఫ్ బలగాలు జేగురుగొండ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను తనిఖీ చేయగా పేలుడు పదార్థాలు దొరికాయి. మందుపాతరలు అమర్చేందుకు వస్తున్న క్రమంలో అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.
హిడ్మా ఇలాకాలో మరో బేస్ క్యాంప్
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, మోస్ట్ వాంటెడ్ నక్సల్ హిడ్మా ఇలాకాలో కేంద్ర హోం శాఖ మరో బేస్ క్యాంపును ఏర్పాటు చేసింది. బెటాలియన్–1 చీఫ్ దేవా ఆధ్వర్యంలోని దళాలు, పామేడు ఏరియా కమిటీల కబ్జాలో ఉన్న గొల్లకుండ అటవీ ప్రాంతంలో ఈ క్యాంప్‌ను నెలకొల్పారు. ఈ ఏడాది దండకారణ్యంలో 25 బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. మావోయిస్టుల సేఫ్ జోన్‌ను స్వాధీనం చేసుకునే క్రమంలో ఈ క్యాంప్‌లను పెడుతున్నారు.