- నారాయణ్‌పూర్, బీజాపూర్ బార్డర్లో ఘటన.. భారీగా ఆయుధాలు స్వాధీనం
- వెయ్యి మంది జవాన్లతో ఆపరేషన్ సూర్యశక్తి
- కొనసాగుతున్న కూంబింగ్
భద్రాచలం, వెలుగు : చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. గురువారం నారాయణ్‌పూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఘటనా స్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలు, ఆయుధాలతో పాటు మరికొంత సామగ్రి స్వాధీనం చేసుకున్నట్టు నారాయణ్‌పూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ తెలిపారు. బీజాపూర్, నారాయణ్‌పూర్, దంతెవాడ జిల్లాల పరిధిలోని డీఆర్జీ, ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్స్‌తో కూడిన వెయ్యి మంది జవాన్లు దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్, బస్తర్ ఎస్పీ శలభ్ కుమార్ ఆధ్వర్యంలో కూంబింగ్ ప్రారంభించారు.
ప్లాటూన్ నంబర్ 16 దళంతో పాటు ఇంద్రావతి ఏరియా కమిటీలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ షురూ చేశారు. నారాయణ్‌పూర్ జిల్లా అబూజ్మాఢ్ ఏరియా ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధిలోని మొహందీ గ్రామంలో ఏర్పాటు చేసిన బేస్ క్యాంప్ నుంచి వీరంతా బయల్దేరారు. రెక్వాయా ప్రాంతంలో వీరి రాకను గమనించిన మావోయిస్టులు.. ఫైరింగ్ ఓపెన్ చేశారు.
దీంతో జవాన్లు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఆపరేషన్.. సాయంత్రం వరకు కొనసాగింది. మొత్తం ఏడుగురు మావోయిస్టుల డెడ్‌బాడీలను పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి రెండు ఏకే 47తో పాటు ఆటోమెటిక్ గన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఆపరేషన్ సూర్యశక్తి
నారాయణ్‌పూర్ జిల్లా అబూజ్మాఢ్ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్టు పక్కా సమాచారం అందింది. దీంతో ‘ఆపరేషన్ సూర్యశక్తి’ పేరిట దంతెవాడ, నారాయణ్‌పూర్, బీజాపూర్ జిల్లాలకు చెందిన వెయ్యి మందితో కూడిన ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్స్, డీఆర్జీ బలగాలను రంగంలోకి దించారు.
ఈ మూడు జిల్లాల సరిహద్దుల్లోని దంతెవాడ అడవుల్లో తొలుత ఐదుగురు మావోయిస్టులు చనిపోగా, నారాయణ్‌పూర్ జిల్లాలో మరో ఇద్దరు మృతి చెందారు. పలువురు మావోయిస్టులు గాయపడగా వారిని అదుపులోకి తీసుకున్నారు.