ఆడపిల్ల అని ఆర్ఎం పీతో అబార్షన్ .. ఏడు నెలల గర్భిణి మృతి

  • సూర్యాపేట జిల్లాలో దారుణం

సూర్యాపేట, వెలుగు:  తన భార్య కడుపులో పెరు గుతున్నది ఆడపిల్ల అని తెలుసుకున్న భర్త ఆర్​ఎంపీతో చేయించిన అబార్షన్ వికటించి ఏడు నెలల గర్భిణి చనిపోయింది. మృతురాలి కుటుంబసభ్యుల కథనం ప్రకారం..మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారం గ్రామ పంచాయతీలోని రాము తండాకి చెందిన సుహాసిని (26)కి, చివ్వెంల మండలం ఎంజీనగర్ తండాకు చెందిన రత్నావత్ హరి సింగ్ కు ఐదేండ్ల కింద పెండ్లయ్యింది. వీరికి ఇప్పటికే ఇద్దరు కూతుళ్లున్నారు. ఏడాదిన్నర కింద సుహాసిని గర్భం దాల్చడంతో స్కానింగ్ చేయించగా ఆడశిశువు అని తేలింది. దీంతో హరిసింగ్.. సుహాసినికి అబార్షన్ చేయించాడు. మళ్లీ ఏడు నెలల కింద రెండోసారి గర్భవతి కావడంతో  మరోసారి స్కానింగ్ తీయించగా ఆడపిల్ల అని నిర్ధారణ అయ్యింది. 

దీంతో అబార్షన్ చేయించేందుకు ఓ డాక్టర్​ను కలవగా ఏడో నెలలో చేస్తే తల్లీ, బిడ్డకు ప్రమాదం ఉంటుందని, వద్దని సలహా ఇచ్చాడు. అయితే, హరి సింగ్ హుజూర్​నగర్ ​ప్రాంతంలో ఓ క్లినిక్​ నడుపుతున్న ఆర్ఎంపీతో అబార్షన్ చేయించాడు. సుహాసిని పరిస్థితి విషమించడంతో సూర్యాపేటలోని ఓ ప్రైవేటు దవాఖానలో చేర్పించాడు. అక్కడే చికి త్స పొందుతూ చనిపోయింది. విషయం 
తెలుసుకున్న సుహాసిని కుటుంబసభ్యులు చివ్వెంల పీఎస్​లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా తమ పరిధిలోకి రాదంటూ సూర్యాపేట టౌన్ పీఎస్​కు వెళ్లాలని సూచించారు. సూర్యాపేటకు వెళ్లగా అక్కడ కూడా ఫిర్యాదు తీసుకోలేదు. దీంతో ఆగ్రహించిన వారు ధర్నాకు దిగారు. దీంతో  కంప్లయింట్ ​తీసుకుని పంపించారు.