మరో ఏడుగురు!..కాంగ్రెస్​లో చేరేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

మరో ఏడుగురు!..కాంగ్రెస్​లో చేరేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
  • సీఎం రేవంత్ సమక్షంలో పార్టీలో చేరిన 
  • గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
  • ఆ వెంటనే మంత్రి శ్రీధర్ బాబుతో గ్రేటర్​లోని
  • ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ 
  • వాళ్లందరూ నేడు చేరుతారని ప్రచారం 
  • వారితో పాటు మరో ఎమ్మెల్యే కూడా చేరే చాన్స్​

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​కు షాక్​ల మీద షాక్​లు తగులుతున్నాయి. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా కారు దిగి కాంగ్రెస్​లో చేరుతున్నారు. రెండ్రోజుల కింద ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్​లో చేరగా, ఇప్పుడు మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శనివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు.

ఈయన లెక్కనే ఇంకో ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరనున్నారని ప్రచారం జరుగుతున్నది. వాళ్లంతా ఆదివారం సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తున్నది. ఇక బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికతో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఏడుకు చేరింది. ఇప్పటికే తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి, దానం నాగేందర్, డాక్టర్ సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్య కాంగ్రెస్ లో చేరారు. కాగా, కృష్ణమోహన్​రెడ్డి చేరిక కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్, సంజయ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. 

ఆ ఏడుగురు ఎవరంటే? 

గ్రేటర్ హైదరాబాద్​కు చెందిన ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్​లో చేరనున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు శనివారం రంగారెడ్డి జిల్లా ఇన్​చార్జ్ మంత్రి శ్రీధర్ బాబును సెక్రటేరియెట్​లో కలవడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుతున్నది. మంత్రిని కలిసిన ఎమ్మెల్యేల్లో కేపీ వివేకానంద (కుత్బుల్లాపూర్), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), సుధీర్ రెడ్డి (ఎల్బీ నగర్), మాధవరం కృష్ణారావు (కూకట్​పల్లి), బండారు లక్ష్మారెడ్డి (ఉప్పల్), మర్రి రాజశేఖర్ రెడ్డి (మల్కాజ్​గిరి) ఉన్నారు. 

నియోజకవర్గాల అభివృద్ధి కోసమే తమ జిల్లా ఇన్​చార్జ్ మంత్రి శ్రీధర్ బాబును కలిశామని ఆ ఎమ్మెల్యేలు చెబుతున్నప్పటికీ, వాళ్లందరూ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరడం ఖాయమని పీసీసీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. వీరితో పాటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని చర్చ జరుగుతున్నది.

80కి చేరనున్న కాంగ్రెస్ బలం.. 

ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 64 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇటీవల జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ గెలవడంతో ఎమ్మెల్యేల సంఖ్య 65కి పెరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్​లో ఏడుగురు ఎమ్మెల్యేలు చేరడంతో.. ఇప్పుడు అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 72కు చేరింది. మిత్రపక్షమైన సీపీఐని కూడా కలుపుకుంటే అది 73 అవుతుంది. ఇక ఆదివారం మరో ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్​లో చేరితే ఆ పార్టీ బలం 80కి చేరుకోనుంది.