ఎమ్మెల్సీలుగా ఏడుగురు ప్రమాణం

ఎమ్మెల్సీలుగా ఏడుగురు ప్రమాణం

హైదరాబాద్, వెలుగు: కొత్తగా ఎన్నికైన ఏడుగురు ఎమ్మెల్సీలు సోమవారం మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం ప్రమాణం చేశారు. కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిచిన బీజేపీ నేత మల్క కొమరయ్య, కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి విజయం సాధించిన మరో బీజేపీ నేత అంజిరెడ్డి, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీగా గెలుపొందిన శ్రీపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్త: మల్క కొమరయ్య

విద్యారంగంలోని సమస్యలతో పాటు టీచర్లు, లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కరీంనగర్ –- నిజామాబాద్ – -ఆదిలాబాద్ – -మెదక్ ఉమ్మడి జిల్లాల బీజేపీ టీచర్‌‌ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య అన్నారు. ఎన్నికల సమయంలో టీచర్లు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. సోమవారం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మల్క కొమరయ్యతో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు ఆయన ట్యాంక్ బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మల్క కొమరయ్య మీడియాతో మాట్లాడారు. తన గెలుపు కోసం కృషి చేసిన టీచర్ల సంఘాలు, బీజేపీ నేతలకు ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమానికి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రఘునందన్ రావు తదితరులు హాజరయ్యారు. 

టీచర్ల గొంతును మండలిలో వినిపిస్తా: శ్రీపాల్ రెడ్డి 

టీచర్ల సమస్యల పరిష్కారం, విద్యారంగం అభివృద్ధి కోసం మండలిలో టీచర్ల గొంతును వినిపిస్తానని వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెండింగ్​లో ఉన్న డీఏల మంజూరుతో పాటు మెరుగైన పీఆర్సీ ఇప్పించేందుకు  కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా సీపీఎస్​ను రద్దు చేయించేందుకు, ఆరోగ్య భద్రత కార్డులు ఇప్పించేందుకు పని చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్‌‌ఎస్ నేతలు పాల్గొన్నారు. 

జీతంలో 25% పార్టీకి, మరో 25% తెలంగాణ ఉద్యమకారులకు: అద్దంకి దయాకర్

ఎమ్మెల్సీగా తనకు వచ్చే జీతంలో 25 శాతం కాంగ్రెస్ పార్టీకి, మరో 25 శాతం తెలంగాణ ఉద్యమకారులకు, మరణించిన వారి కుటుంబాలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు అద్దంకి దయాకర్ ప్రకటించారు. ప్రమాణస్వీకారం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల మధ్య నుంచి, తెలంగాణ ఉద్యమకారునిగా ఎమ్మెల్సీ అయినందున తాను ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ నుంచి విజయశాంతి, 
అద్దంకి దయాకర్, 
శంకర్ నాయక్

బీజేపీ నుంచి 
మల్క కొమరయ్య, అంజిరెడ్డి, 
సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం

టీచర్స్ ఎమ్మెల్సీ 
శ్రీపాల్ రెడ్డితో ప్రమాణం చేయించిన చైర్మన్ గుత్తా