- జనగామ జిల్లాలో 7
- వరంగల్ జిల్లాలో 6
- హనుమకొండలో 5
జనగామ అర్బన్, వెలుగు : జనగామ జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎలక్షన్లకు జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఏడు నామినేషన్లు దాఖలయ్యాయని ఎలక్షన్ ఆఫీసర్, కలెక్టర్ సి.హెచ్. శివలింగయ్య తెలిపారు. జనగామ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు నామినేషన్లు, పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఒక నామినేషన్, స్టేషన్ ఘనపూర్ నుంచి రెండు నామినేషన్లను రిటర్నింగ్ ఆఫీసర్లు స్వీకరించారు.
జనగామ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థి సాధం మదన్ మోహన్, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి మంతెన నరేశ్, ఇండియా ప్రజాబంధు అభ్యర్థి గంధమల్ల ఇస్తారీ, పాలకుర్తి నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి మాధవరెడ్డి వెంకట్‌రెడ్డి, స్టేషన్ ఘనపూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సింగపురం ఇందిర, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఆర్నేని ప్రేమ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు.
పల్లా రాజేశ్వర్ రెడ్డి భారీ ర్యాలీ..
ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. జనగామ, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఆప్కో చైర్మన్ మండల శ్రీరాములులతో కలిసి భారీ ర్యాలీగా ఆయన రిటర్నింగ్ ఆఫీస్‌కు చేరుకుని నామినేషన్ వేశారు.
హనుమకొండలో ..
హనుమకొండ, వరంగల్, వెలుగు : హనుమకొండ జిల్లాలోని వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి మంగళవారం మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయి. బీజేపీ అభ్యర్థి రావు పద్మ భద్రకాళి ఆలయంలో పూజల అనంతరం హనుమకొండలోని ఆఫీస్‌లో రిటర్నింగ్ ఆఫీసర్ ఎల్.రమేశ్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆమె వెంట భర్త రావు అమరేందర్ రెడ్డి, బీజేపీ నాయకులు మార్తినేని ధర్మారావు, దేశిని సదానందంగౌడ్ తదితరులున్నారు. కాగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తో పాటు ఇండిపెండెంట్ గా పెండెం రాఘవరావు రెండు నామినేషన్లు వేశారు. పరకాల నియోజకవర్గ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా డా.పగడాల కాళీప్రసాద్, ఇండిపెండెంట్ గా అందె కుమారస్వామి నామినేషన్ దాఖలు చేశారు.
వరంగల్ జిల్లాలో ఆరు
వరంగల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు మంగళవారం మొత్తం ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. నర్సంపేట నియోజకవర్గ స్థానానికి డా.పెంచాల శ్రీనివాస్ బీజేపీ తోపాటు ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు. పెద్దారపు రమేశ్ ఎంసీపీఐ(యూ) నుంచి నామినేషన్ దాఖలు చేశారు. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి సండ్ర జాన్సన్ ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు. వర్దన్నపేట నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేఆర్ నాగరాజు, బీజేపీ అభ్యర్థిగా కొండేటి శ్రీధర్ నామినేషన్ దాఖలు చేశారు.
మహబూబాబాద్‌లో ఒకే ఒక్క నామినేషన్
మహబూబాబాద్, వెలుగు : డోర్నకల్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు మంగళవారం ఇండిపెండెంట్ క్యాండిడేట్ డోర్నకల్ మండలం గొల్లచర్ల గ్రామానికి చెందిన భూక్యా నరేశ్ నామినేషన్ వేసినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ నరసింహారావు తెలిపారు. కాగా మహబూబాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఎటువంటి నామినేషన్లు స్వీకరించలేదని ఆఫీసర్లు తెలిపారు.
ములుగులో నామినేషన్ వేసిన స్వతంత్ర అభ్యర్థి సమ్మక్క
ములుగు : అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు మహబూబాబాద్ జిల్లా గంగారం గ్రామానికి చెందిన వజ్జ సమ్మక్క స్వతంత్రఅభ్యర్థిగా మంగళవారం నామినేషన్ వేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, పీవో అంకిత్ కు తన నామినేషన్ పత్రాలను అందజేశారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు సమ్మక్కను బలపరిచారు. ఇప్పటివరకు మొత్తం 2మాత్రమే నామినేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.