కరాచీ: పాకిస్తాన్లో ఘోర ప్రమాదం జరిగింది. మినీ వ్యాన్ అదుపు తప్పి ట్రక్కును ఢీకొట్టడంతో ఏడుగురు మృతి చెందారు. ఆదివారం కరాచీలోని సింధ్ ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు యూటర్న్ తీసుకున్నప్పుడు వెనుక నుంచి వచ్చిన మినీ వ్యాన్ దానిని ఢీ కొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ, చిన్నారితో సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మినీ వ్యాన్ డ్రైవర్‌కు గాయాలు కాగా, ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు.
సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాయి. మృతదేహాలను సివిల్ హాస్పిటల్‌కు తరలించాయి. ఈ ప్రమాదంపై సింధ్ సీఎం మురాద్ అలీ షా విచారం వ్యక్తంచేశారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు. ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని సింధ్ ఇన్ స్పెక్టర్ జనరల్ గులాం నబీ మెమన్ను ఆదేశించారు.