ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై దాడికి పాల్పడిన ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు పోలీసులు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
అసలేం జరిగింది..?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
వరంగల్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఆర్టీసీ బస్సు.. ఏడుగురు యువకులు ప్రయాణిస్తున్న కారుకు తగిలింది. దీంతో ఆ యువకులు కోపంతో బస్సు డ్రైవర్ పై దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు భయంతో పోలీసులకు సమాచారం అందించారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి చెంగిచర్ల దగ్గర ఘటన చోటుచేసుకుంది.
విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆ తర్వాత దాడికి పాల్పడ్డ యువకులు కొడిదెల సురేష్, పల్ల పవన్, పల్లపు రాజు, పల్లపు ప్రమోద్, రవి, పల్లపు నవీన్, పల్లపు నవీన్ అనే ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా హైదరాబాద్ కార్వాన్ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. దాడికి పాల్పడ్డ నిందితులపై 392, 353, 332 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి.. రిమాండ్ కు తరలించారు.