మునుగోడులో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ

  • బీఎస్పీ, టీజేఎస్, ఆప్, ప్రజాశాంతి పార్టీ కూడా బరిలోకి 
  • బీసీ సంఘాల తరఫునా క్యాండిడేట్ ను దింపే చాన్స్ 

హైదరాబాద్, వెలుగు: మునుగోడు బైపోల్ లో పోటీ చేసేందుకు ఏడు పార్టీలు రెడీ అయ్యాయి. ఇప్పటికే ప్రజాశాంతి పార్టీ ప్రజా గాయకుడు గద్దర్ ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఆప్, బీఎస్పీ, టీజేఎస్ కూడా త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించాయి. మునుగోడులో లక్షన్నర మంది వరకూ బీసీ ఓటర్లే ఉన్నందున బీసీ సంఘాల తరఫున అభ్యర్థిని రంగంలోకి దింపాలని బీసీ సంక్షేమ సంఘం నేత, మునుగోడుకు చెందిన జాజుల శ్రీనివాస్ గౌడ్ ఒత్తిడి తెస్తున్నారు. ఈ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఒక్కసారి కూడా బీసీకి టికెట్ ఇవ్వలేదని ఆయన చెబుతున్నారు. దీంతో మూడు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ తోపాటు.. ఇప్పుడు మరో నాలుగు పార్టీలు ఉప ఎన్నిక బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. 
బీఎస్పీ, ఆప్ రెడీ 
మునుగోడు ఉప ఎన్నికలో బీఎస్పీ అభ్యర్థిగా ఆందోజు శ్రీకాంతచారిని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. అభ్యర్థికి శనివారం బీ ఫాం కూడా అందచేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సైతం మునుగోడులో బరిలోకి దిగనుందని ఆ పార్టీ నేత ఇందిరా శోభన్ తెలిపారు. ఈ అంశంపై పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో చర్చిస్తున్నామని, రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని ఆమె వెల్లడించారు. 
తొలిసారి ఎన్నికల బరిలోకి గద్దర్ 
ప్రజా గాయకుడు గద్దర్ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ప్రజా శాంతి పార్టీ అభ్యర్థిగా గద్దర్ ను ఎన్నికల బరిలోకి దించుతున్నామని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు. అయితే గద్దర్ తెలంగాణవాదుల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా ఉండాలని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే గద్దర్ ను కలిసి మాట్లాడతానని తెలిపారు. అయితే, మునుగోడు బైపోల్స్ లో టీజేఎస్ తరపున అభ్యర్థిని నిలెబెడ్తున్నట్లు కోదండరాం ఇదివరకే ప్రకటించారు. రెండు రోజుల్లోనే ఫైనల్ చేస్తామని, బీసీ అభ్యర్థినే పోటీకి దింపుతామన్నారు. 
బీసీ సంఘాల తరపున అడ్వకేట్ 
బీసీ సంఘాల తరపున సుప్రీంకోర్టు, హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ గా పనిచేస్తున్న శేషగిరి గౌడ్ పోటీ చేస్తున్నారు. ఈ నెల 11 లేదా 12న నామినేషన్ వేయనున్నారు. ఆయనకు ఎంపీ ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్,  బీసీ సంఘాల నేత దాసు సురేష్ , బీసీ నేత సూర్యారావు, నిజాం కాలేజ్ ఫ్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మద్దతు ఇస్తున్నారు.  
ఓట్లు చీలే అవకాశాలు పెరుగుతయ్  
మూడు పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉన్నప్పటికీ బీసీ సంఘాలు, ఇతర పార్టీలూ మునుగోడు బరిలోకి దిగడం, గద్దర్ కూడా పోటీలో ఉండటంతో ఓట్లు చీలే అవకాశాలు పెరుగుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లలో 75 శాతం మంది బీసీ ఓటర్లే ఉన్నా.. ప్రధాన పార్టీలు ఓసీ అభ్యర్థినే పోటీకి దించడమేందని మిగతా పార్టీలు, ప్రజా సంఘాలు ఫైర్ అవుతున్నాయి. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళతామని చెప్తున్నాయి.